కేంద్రం నిర్ణయంతో ఎంపీలు ఇక హ్యాపీ..

= సార్.. మా ఊళ్లో రోడ్డు సరిగా లేదు.. మీ ఫండ్ నుంచి కొంత కేటాయించి రోడ్డు వేయించండి.. మీ పేరు చెప్పుకుంటాం..

= మా గ్రామంలో ఆస్పత్రి భవనం అధ్వానంగా ఉంది.. పడిపోతుందేమో.. కొంత డబ్బు కేటాయించి ఆస్పత్రికి మరమ్మతులు చేయించండి.. మిమ్మల్నే తలుచుకుంటాం..

= మా పల్లెలో స్కూలు మరీ దారుణంగా ఉంది.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. మీరైనా దయచూడండి..

…ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని వేలమంది ఎంపీలను కోరేవారు. ఎంపీలు కూడా కాదనకుండా చేస్తాం.. చూస్తాం అని చెప్పి పంపించేవాళ్లు. అయితే సమస్యను మాత్రం పరిష్కరించేవారు కాదు. సంబంధిత అధికారులకు మాత్రం చెప్పేవారు. కారణం ఎంపీలకు ప్రత్యేకంగా నిధులు లేకపోవడం. అదే.. ఎంపీ ల్యాడ్స్.. గతంలో ఎంపీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారు. వారి నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి ఈ నిధులు వాడేవారు. అయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు ఎంపీ ల్యాడ్స్ కేంద్రం ఆపేసింది. దీంతో నిధులు లేవని ప్రజలకు చెప్పలేక.. సమస్య తీర్చలేక ఎంపీలు ఇబ్బంది పడేవారు. ఇక నుంచి ఈ సమస్య ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు ఈ సంవత్సరం నిధులు కేటాయించింది. ఈ మేరకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎంపీకి ఈ సంవత్సరం (2021.22) రూ.2 కోట్లు కేటాయించనున్నారు. తరువాత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022.23, 2023.24) ఒక్కొక్కరికి రూ.5 కోట్లు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం రూ.1,584 కోట్లు, వచ్చే సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు రూ.15,833 కోట్లు విడుదల చేయనుంది. అంటే నాలుగేళ్లలో మొత్తం రూ.17,417 కోట్లను మన ఎంపీలు ఖర్చు చేయవచ్చన్నమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అనేకమంది ఎంపీలు ఖుషీ అవుతున్నారు. జనం తమ వద్దకు వచ్చినపుడు.. వారి సమస్య తీవ్రమైనదే అయినా.. ఎంపీ ల్యాడ్స్ లేకపోవడంతో ఏమీ చేయలేకపోయామని.. ఇపుడు అవకాశం ఉందని పలువురు ఎంపీలు పేర్కొంటున్నారు.