జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేద‌న‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విలక్షణ నటుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న‌ కోట శ్రీనివాస్ రావు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై విలన్‏గా ముచ్చెమటలు ప‌ట్టించ‌డ‌మే కాదు.. హాస్యనటుడిగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి.

ముఖ్యంగా త‌న‌యుడు ఆంజనేయ ప్రసాద్‌ హ‌ఠాన్మ‌ర‌ణం కోటా శ్రీ‌నివాస్ రావును తీవ్రంగా క‌ల‌చి వేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మ‌ర‌ణాన్ని మ‌రోసారి త‌ల‌చుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. “మా అబ్బాయి ఆంజనేయ ప్రసాద్‌ ‘గాయం- 2’ సినిమాలో నా కొడుకు వేషం వేశాడు. ప్రవీణ్ శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు హీరోగా న‌టించారు.

అయితే ఓ రోజు మా అబ్బాయిని జగపతి బాబు చంపేసే సీన్‌ షూట్ చేస్తారని డైరెక్ట‌ర్ చెప్పారు. లొకేషన్‌లో పాడె కూడా సిద్ధం చేస్తున్నారు. సినిమా కోస‌మే అయిన‌ప్ప‌టికీ.. క‌న్న కొడుకు పాడెపై ప‌డుకోవ‌డం అంటే ఎంతో బాధ‌ను క‌లిగింది. వెంట‌నే విష‌యాన్ని జ‌గ‌ప‌తిబాబుకు చెప్ప‌గా.. ఆయ‌న `మరేం ఫర్లేదు కోట గారు.. మీరు రిలాక్స్ అవండి. ఆ సీన్‌లో అక్కడ మీ అబ్బాయి బదులు డూప్‌ని పెడదాం. మీ ఫీలింగ్‌ నాకు అర్థమైంది`అన్నారు.

ఆయ‌న చెప్పున‌ట్టే నా కొడుకు స్థానంలో డూప్‌ను పెట్టి సీన్ షూట్ చేశారు. కానీ, ఈ ఘ‌ట‌న జ‌రిగిన వారానికే నా కొడుకు పోయాడు.“ అని చెబుతూ కోటా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా, కోట ప్రసాద్ 2010 జూన్ 21 లో మరణించాడు. బైక్‌పై వెళ్తుండ‌గా.. ప్రమాదానికి గురై ఆయ‌న క‌న్నుమూశారు.

 

Share post:

Latest