8 ఏళ్ల పాటు బెడ్‌పైనే.. బాల్యంలో న‌ర‌కం చూసిన శివ శంకర్ మాస్టర్!

ప్ర‌ముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ప‌లువురు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో కృషి చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శివశంకర్‌ మాస్టర్‌ తుది శ్వాస విడిచారు.

అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులోని చెన్నై లో 1948 డిసెంబరు 7వ తేదీన కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ దంపతులకు జ‌న్మించిన శివ శంక‌ర్ మాస్ట‌ర్‌.. బాల్యంలో ఎన్నో బాధ‌ల‌ను అనుభ‌వించారు. ముఖ్యంగా ఓ అనుకోని ప్ర‌మాదంలో ఏడాదిన్నర వయసు ఉన్న‌ప్పుడే.. శివ శంక‌ర్ మాస్ట‌ర్‌కి వెన్నెముకకు తీవ్ర గాయమైంది.

అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే ఆయన వద్దకు శివ శంకర్ మాస్టర్‌ను తీసుకెళ్ల‌గా.. పరీక్షలో వెన్నెముక విరిపోయిందని తేల్చార‌ట‌. అయితే స‌ద‌రు డాక్టర్ తన దగ్గర శివ శంకర్ ని వదిలితే.. నడిచేలా చేస్తానని హామీనిచ్చారు. ఆయనను నమ్మి శివ శంకర్‌ను ఆయ‌న‌ తండ్రి అక్కడే వదిలేసి వెళ్లిపోయారట.

దీంతో దాదాపు ఎనిమిదేళ్ల పాటు శివ శంకర్ మాస్ట‌ర్ బెడ్ పైనే ఉన్నార‌ట‌. ఎంతో అందంగా సాగాల్సిన బాల్యంలో శివ శంక‌ర్ మాస్ట‌ర్ న‌ర‌కం చూశారట‌. ఇక ఆ త‌ర్వాత ఎలాగోలా గాయం నుంచి కోలుకున్న శివ శంక‌ర్ మాస్ట‌ర్‌.. డ్యాన్స‌ర్‌గా మారి అంచ‌లంచ‌లుగా ఎదిగారు. ఈ క్ర‌మంలోనే తెలుగు, తమిళ సహా సుమారు 10 భాషల్లో 800 లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారీయ‌న‌.