హైదరాబాద్ లో మరో దారుణం : భర్తకు మద్యం తాపి భార్యపై అత్యాచారం, హత్య..!

హైదరాబాదులో దిశపై హత్యాచారం ఘటన తర్వాత నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల నియంత్రణ కోసం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ కామాంధులు చెలరేగుతూనే ఉన్నారు.
తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తికి మద్యం తాపించి అతడు స్పృహ కోల్పోయిన తర్వాత అతడి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగులు అంతటితో ఆగకుండా ఆమెను చంపేశారు. ఈ సంఘటన ప్రస్తుతం హైదరాబాద్ లో సంచలనంగా మారింది.

హయత్ నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. తారామతిపేట్ లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి తన ఇంట్లోనే ఇద్దరు వ్యక్తులతో కలసి మద్యం సేవించాడు. ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు దుండగులు ఆ వ్యక్తికి ఫుల్లుగా మద్యం తాగించారు. ఆ తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు దుండగులు అతడి భార్య పై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అదే ప్రాంతానికి చెందిన సురేష్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడానికి వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు వారి విచారణలో తేలింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టి సురేష్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే ఇంటికొచ్చి దారుణానికి ఒడిగట్టడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.

Share post:

Latest