వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: కొండపొలం
దర్శకత్వం: క్రిష్
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రామి రెడ్డి
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్
సంగీతం: ఎంఎం కీరవాణి
నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, తదితరులు
రిలీజ్ డేట్: 08-10-2021

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమాగా, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కడంతో కొండపొలం చిత్రం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాను పూర్తిగా అడవి నేపథ్యంలో తెరకెక్కించగా, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి కొండపొలం చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఏమేర అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
నల్లమల అటవీప్రాంతానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్(వైష్ణవ్ తేజ్) పట్నంలో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా.. అతడు వరుసగా రిజెక్ట్ అవుతూ వస్తాడు. దీంతో తన తాత(కోట శ్రీనివాసరావు) సూచన మేరకు తన తండ్రి(సాయి చంద్)తో కలిసి తన కుటుంబానికి ఆసరాగా నిలిచే మేకల మందను కొండపొలం వద్దకు తీసుకొస్తాడు. అయితే ఈ క్రమంలో అతడికి అడవిలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతడు ఎలా అధిగమించాడు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ నవల ఆధారంగా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన రవీంద్ర యాదవ్(వైష్ణవ్ తేజ) పట్నంలో ఇంటర్వ్యూల్లో వరుసగా రిజెక్ట్ అవుతూ వస్తాడు. దీంతో విసుగు చెందిన అతడు తిరిగి తన ఊరికి వచ్చేస్తాడు. అయితే కరువు కారణంగా ఆ ఊరిలోని మేకల మందలను వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారు అక్కడి జనం. ఈ క్రమంలో తన తాత సూచన మేరకు కొండపొలంకు వెళ్లేందుకు రవీంద్ర కూడా రెడీ అవుతాడు.

కట్ చేస్తే.. కొండపొలం వెళ్లే మార్గమధ్యలో వారికి పలు సమస్యలు ఎదురవుతాయి. మేకల మందలో నుండి ఒక్కో మేకను అడవిలోని పెద్దపులి చంపేస్తూ ఉంటుంది. ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ దగ్గర ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ఇక సెకండాఫ్‌లో రవీంద్ర పెద్దపులి బారి నుండి తన మేకల మందను ఎలా కాపాడుతాడు, తాను ప్రేమించే ఓబులమ్మ(రకుల్ ప్రీత్ సింగ్)ను ఎలా ఆకట్టకుంటాడు, అడవిలో అతడికి ఎదురయ్యే పలు సమస్యలను అతడు ఏ విధంగా ధైర్యంగా ఎదురిస్తాడు అనేది మనకు చాలా చక్కగా చూపించారు. ఓ సాలిడ్ సీక్వెన్స్‌తో ఈ సినిమా క్లైమాక్స్ ఉండటం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా కొండపొలం చిత్రం సగటు ఆడియెన్స్‌ను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

నటీనటులు పర్ఫార్మెన్స్:
కటారు రవీంద్ర యాదవ్ అనే పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఉప్పెన తరువాత ఈ హీరో మెచ్యూరిటీతో కూడిన పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ఎమోషనల్ సీన్స్‌లో కూడా వైష్ణవ్ ఆకట్టుకున్నాడు. అటు ఓబులమ్మ పాత్రలో రకుల్ పర్ఫార్మెన్స్ బాగుంది. సాయి చంద్ మరోసారి తన పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.

టెక్నికల్ పర్ఫార్మెన్స్:
దర్శకుడు క్రిష్ తెరకెక్కించే సినిమాలు ఎందుకు ప్రత్యేకంగా ఉంటాయో మరోసారి కొండపొలం చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో క్రిష్ ప్రతిభ ఏమిటో మరోసారి మనకు కనిపిస్తుంది. నటీనటుల నుండి ఎలాంటి పర్ఫార్మెన్స్‌నైనా ఆయన ఇట్టే రాబట్టుకోగలడు. మొత్తానికి క్రిష్ ఎంచుకున్న కథను తాను అనుకున్నట్లుగానే ప్రెజెంట్ చేసి వావ్ అనిపించాడు. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం మరో ప్లస్. అన్ని పాటలు కూడా బాగుండగా, బీజీఎం సూపర్బ్‌గా ఉంది. కొన్ని సీన్స్‌లో వచ్చే బీజీఎం గూస్‌బంప్స్‌ను తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు కూడా సూపర్బ్.

చివరగా:
కొండపొలం – క్రిష్ మ్యాజిక్‌కు సలాం!

రేటింగ్:
3.0/5.0

Share post:

Latest