కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన అక్కడే తుదిశ్వాస విడిచి.. యావత్ చిత్ర పరిశ్రమను, అభిమానులను శోకసంద్రంలోకి ముంచేశారు.
అయితే పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటుతో హఠాన్మరణం` ఆనవాయితీగా వస్తోంది. అవును.. పునీత్ తండ్రి, లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమను కొన్ని ఏళ్లపాటు ఏలారు. కన్నడ కంఠీరవగా, కన్నడ కల్చర్‌కి ఐకాన్‌గా నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.
అలాగే పునీత్ సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ 54 ఏళ్ల వయసులో గుండెపోటుకు గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. అయితే హాస్పటల్లో ఎన్నో రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆయన చివరకు ఎలాంటి ప్రాణపాయం లేకుండా సురక్షింగా బయటపడ్డారు. ఇక ఇప్పుడు ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌ను సైతం గుండెపోటే ముంచేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. జిమ్ వర్కవుట్‌తో పాటు పునీత్ క్రాస్ ఫిట్, మార్షల్ ఆర్ట్స్, యోగా వంటివి కూడా రెగ్యులర్‌గా చేస్తాడు. అయినప్పటికీ ఆయన్ను గుండెపోటు కబలించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.