అన్నాడీఎంకేలో ‘శశి కల’కలం.. పార్టీ స్వాధీనంలో చిన్నమ్మ దూకుడు..!

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో అమ్మ జయలలిత తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో చిన్నమ్మ శశికళ ఉండేది. జయ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శశికళ పార్టీ వ్యవహారాలను అన్ని తానై చూసుకునేది. జయ అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించగా.. ఆమె మరణం తర్వాత పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి దించి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శశికళ ప్రయత్నించింది.

ఆలోగా అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలుపాలైంది. శశికళ వెళ్తూ వెళ్తూ తన అనుచరుడైన ఎడప్పాడి పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి జైలు కెళ్ళింది. ఆమె జైలులో ఉన్న సమయంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఒక్కటై శశికళను అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. అంతేగాక ఆ పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. శశికళ సరిగ్గా ఎన్నికలకు ముందుగా జైలు నుంచి విడుదలకాగా.. ఆమె తిరిగి అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది.

ఆ తర్వాత రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించింది. అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందింది. పార్టీ ఓటమి తర్వాత శశికళ తీరులో మార్పు వచ్చింది. అన్నాడీఎంకేకు తానే ప్రధాన కార్యదర్శినని.. పార్టీని మళ్లీ స్వాధీనం చేసుకొని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. అంటూ ఇటీవల శశికళ ప్రకటించడం అన్నాడీఎంకేలో కలకలం రేపుతోంది.

కొన్నేళ్లుగా శశికళకు శత్రువుగా మెలిగిన పన్నీర్ సెల్వం అనూహ్యంగా ఆమెకు మద్దతు తెలుపుతూ తాజాగా ప్రకటన చేయడం సంచలనం సృష్టించింది.రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని.. వారిని ఆమోదించడమా.. లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు.. అంటూ శశికళకు మద్దతు తెలిపేలా పన్నీర్ సెల్వం చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే నేతలు రగిలిపోతున్నారు.

ముఖ్యంగా పళని స్వామి వర్గానికి పన్నీర్ సెల్వం తీరు నచ్చడం లేదు. ఎడప్పాడితో నెలకొన్న విభేదాల కారణంగానే పన్నీర్ సెల్వం శశికళ కు దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది. పళని స్వామికి ప్రజల్లో మాస్ ఇమేజ్ లేకపోవడం, ఆర్థికంగానూ శశికళ అంత స్థాయిలో లేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. పార్టీలో నెంబర్ టు పొజిషన్లో ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు శశికళకు మద్దతు తెలుపుతుండడంతో ఆమె తిరిగి పార్టీని చేజిక్కించుకోవడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.