రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. ఇప్పటి వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. పైగా మొన్నీ మధ్య ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ అసలు పూర్తే కాలేదంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ మూవీపై ఓ నయా అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట. ఎన్టీఆర్ కూడా అది నచ్చిందని తెలుస్తోంది.
అలాగే అక్టోబర్ మూడో వారం నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే ఈ సినిమా సెట్‌ను నిర్మిస్తున్నారని.. సినిమాలో కీలక భాగం ఆ సెట్ లోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక అక్టోబర్‌లో షూట్ స్టార్ట్ అవుతుందని వార్త బయటకు రావడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.