బాహుబలి కలెక్షన్లపై దర్యాప్తు.. సగం డబ్బు ఎగ్గొట్టారు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు..!

బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్లకు పన్ను కట్టకుండా ఎగ్గొట్టారని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా తొలి వారం కలెక్షన్లలో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లలేదని తెలిసినట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. సినిమా విడుదలైన తొలివారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్లు తెలిసిందని చెప్పారు.

బాహుబలి సినిమా నుంచి ప్రభుత్వ ఖజానాకు ఎంత పన్ను రాలేదో తేల్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు.ఈ వ్యవహారంలో నిజం బయటకు తెచ్చేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వమే ఆన్లైన్లో టికెట్లు విక్రయించి ప్రేక్షకులకు వినోదం సరసమైన ధరలో అందిస్తామని అంటుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకు వచ్చే విధానం ద్వారా ఎన్టీఆర్ సినిమా అయినా కాంతారావు సినిమా అయినా టికెట్ ధర ఒకేలా ఉంటుందన్నారు. గతంలో సినిమా టికెట్ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవని అన్నారు.

ఇప్పుడు సినిమా టికెట్ ధర రూ.500 వరకు పెంచి వారం రోజుల్లోనే పెట్టుబడులు వెనక్కు తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు పెద్ద గుదిబండగా మారాడని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి తేవడం ద్వారా అక్కడికక్కడే ఎవరికి రావాల్సిన డబ్బులు వారికి వెంటనే వెళ్లిపోతాయని సజ్జల వెల్లడించారు.