అప్పుడు కత్తి మహేష్ కు జరిగిందే.. ఇప్పుడు పోసానికి జరగనుందా..!

కత్తి మహేష్ మొదట టెన్ టీవీ లో సినీ క్రిటిక్ గా పని చేశాడు. మొదట్లో ఆయన అంతగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా పై రివ్యూ చేశాడో అప్పటినుంచి అతడు ఫేమస్ అయ్యాడు. అజ్ఞాతవాసి కి కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, ఫ్యాన్స్ కి కత్తి మహేష్ దీటుగా సమాధానం ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కత్తి మహేష్ కి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిందని చెప్పొచ్చు.

అప్పటి నుంచి కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజకీయంగా కూడా విమర్శలు చేశాడు. దీనిపై పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఛాంబర్లో నిరసన వ్యక్తం చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కత్తి మహేష్ శ్రీ రాముడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నగర పోలీసులు అతడిని హైదరాబాద్ నుంచి ఏడాదిపాటు బహిష్కరించారు.

అలాగే వర్మ మాట విని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ని దుర్భాషలాడిన నటి శ్రీ రెడ్డి కూడా కొన్ని నెలలుగా చెన్నైకి పరిమితమైంది. ఇక తాజాగా తెలుగు ఇండస్ట్రీ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్, పవన్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడం తో ఒక్కసారిగా పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో వారం నడుస్తోంది.

పోసాని కృష్ణమురళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతుండగా అతడిపై దాడి చేసేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అరెస్టు చేయడం, అలాగే జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు పోసాని పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఇది ఇలాగే జరిగితే పోసానిని కూడా హైదరాబాద్ నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కత్తి మహేష్ విషయంలో ఏం జరిగిందో పోసానికి కూడా అదే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.