ఢిల్లీలో సారు ఏం చేస్తున్నారో..?

ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజులైంది.. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని వదలి.. ఈనెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు 1వ తేదీన కేసీఆర్ వెళ్లారు. ఆ వేడుక ముగిసిన అనంతరం ప్రధాని మోదీ అపాయింట్ కోసమని ఆగారు. మోదీని కలిశారు.. ఆ తరువాత పార్టీలో నెంబర్ 2 అయిన అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర పెద్దలను కలిశారు. వరుసగా బీజేపీ పెద్దలతో కేసీఆర్ ఎందుకు భేటీ అవుతున్నారో? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందో ? అనే టెన్షన్ టీఆర్ఎస్ కార్యకర్తల్లో కంటే బీజేపీ రాష్ట్ర నాయకులను వేధిస్తోంది. రాష్ట్రంలో కారుతో కమలం ఢీ.. అంటే ఢీ అని బండి సంజయ్ ఘాటుగా విమర్శిస్తుంటే అక్కడ ఢిల్లీలో మాత్రం తమ పార్టీ పెద్దలతో కేసీఆర్ హ్యాపీగా కలుస్తున్నారు. సీఎం అడిగిన వెంటనే పీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా బీజేపీ నాయకులు భరించలేకపోతున్నారు. తాను నిదానంగా వస్తానని, మీరు వెళ్లండని కేసీఆర్ అధికారులతో కూడా పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయ సమీకరణాలపై బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు జరుగుతున్నట్లు కూడా తెలిసింది.

హైదరాబాద్ లెక్కలు వేరు.. ఢిల్లీలెక్కలు వేరు

రాజకీయ పార్టీలన్న తరువాత వారికి కొన్ని లెక్కలుంటాయి. అది ప్రాంతీయపార్టీలైనా, జాతీయ పార్టీలైనా.. అదే ఇపుడు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నది. ఎన్నికల తీర్పును ప్రజలు ఎప్పుడు ఎలా ఇస్తారో ఎవరికీ అంతుపట్టదు. తాము ఖచ్చితంగా గెలిచి తీరుతాం అని ఏ పార్టీ కూడా ధైర్యంగా చెప్పలేదు. బొటాబొటీగా సీట్లు వచ్చినపుడు మాత్రం ఇతరుల సహకారం తీసుకోవాల్సిందే. ఇపుడు టీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న పని ఇదే. ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటున్నా జాతీయ రాజకీయాల విషయం వచ్చేసరికి సమీకరణలు మారిపోతాయి. ఎవరి అవసరం ఎవరికైనా రావచ్చు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మెజారిటీకి సరిపడా సీట్లు రాకపోతే కేసీఆర్ అవసరం కూడా పడవచ్చు. ఏమో.. ఎవరికి తెలుసు. అందుకే కేసీఆర్ తో శత్రుత్వం ఎందుకని మోదీ ఆలోచిస్తున్నారని సమాచారం.