సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ ఒకే రోజు రానున్నారు.

నిర్మల్ లో అమిత్ షా

అమిత్ షాను రాష్ట్రానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు టీ.బీజేపీ నాయకులు పెద్ద ప్లాన్ వేశారు. నిర్మల్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కమలం నేతలు అనేక సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారు స్పందించకపోవడంతో కేంద్ర హోం మంత్రి ఆధ్వరంలోనే వేడుక చేయనున్నారు. అంతేకాక ఆ రోజు బీజేపీ టాప్ మోస్ట్ లీడర్, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కూడా. ఈ రెండు వేడుకలను ఒకే వేదికపై నిర్వహించి టీ.బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూనే పథకాలు రూపొందిస్తున్నారు.

రేవంత్ సభలో రాహుల్

టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దళిత గిరిజన దండోరా సభలో నిర్వహిస్తున్నారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో ఈనెల 17న జరిపే సభకు రాహుల్ గాంధీ రానున్నట్లు సమాచారం. ఈ పాటికే రాహుల్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే ఈ భారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే అవకాశముంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని బలంగా చెప్పనున్నారు. దాదాపు 5 లక్షల మందితో సభ నిర్వహించాలని టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 2018లో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ మూడేళ్ల తరువాత మరోసారి అడుగుపెట్టనున్నారు. రాహుల్ గాంధీ.. రేవంత్ సభకు హాజరైతే మాత్రం రేవంత్ పొలిటికల్ మైలేజ్ పెరిగినట్లే. అయితే రేవంత్ ను వ్యతిరేకించే వాళ్లు పార్టీలో చాలా మందే ఉన్నారు. మరి వారెలా స్పందిస్తారో..