జగన్ నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ హ్యాపీ..

రాష్ట్రంలోని రోడ్లకు వర్షాకాలం అనంతరం వెంటనే మరమ్మతు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట. అదేంటి.. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వీరికెందుకు అంత హ్యాపీ.. అందులోనూ ఏపీలో ప్రభుత్వం వైసీపీ చేతిలో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేన పార్టీలో ఉంటారు కదా అనుకునేరు. అసలు విషయమేమిటంటే.. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా వాటిని చూసి సర్కారును ఘాటుగా విమర్శించారు. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే జగన్ ఏమనుకున్నారో.. ఏమో.. తెలియదు కానీ.. సోమవారం రోడ్లపై సమీక్ష నిర్వహించి.. వర్షాకాలం అనంతరం రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. జగన్ ఆదేశాలు టీవీలు, పత్రికల్లో రావడంతో జేఎస్పీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పవన్ సార్ విమర్శలకు ఇంత స్పందన ఉందా అని వండర్ అవుతున్నారట.

మొత్తం లెక్క తీయాలంటున్న పవన్

జనసేన కార్యకర్తలు రోడ్ల సమస్యను వెలుగులోకి తీసుకురావడం వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాక పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రంలోని మొత్తం రోడ్ల పరిస్థితిని బయటకు తీయాలని, అన్నింటినీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని సూచించాడు. దీంతో పవన్ చెప్పిందే ఆలస్యమన్నట్లు ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు.