సీటీమార్‌కు అదిరిపోయే ప్రమోషన్స్.. మరి రిజల్ట్..?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ మహిళా కబడ్డీ జట్టు కోచ్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్స్‌ను చేస్తోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అటు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాలేదని, ఫోన్‌లో తన శుభాకాంక్షలు తెలిపాడని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్న సీటీమార్ చిత్రం వినాయక చవితి కానుకగా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందా అని చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆతృత నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో సీటీమార్ ఖచ్చితంగా హిట్ కొట్టాలని చాలా మంది ఆశిస్తున్నారు. మరి సినిమాలో సాలిడ్ కంటెంట్ ఉంటే ఈ సినిమాకు ఎదురే ఉండదని, సినిమాలో సత్తా లేకపోతే మాత్రం ఎంతటి ప్రమోషన్స్ చేసినా ఫలితం మారదని సినీ క్రిటిక్స్ అంటున్నారు. మరి సీటీమార్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.