రోబోలో చిట్టీ రేంజ్ లో.. చెప్పుల్లో బ్లూటూత్ పెట్టి కాపీయింగ్.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఉద్యోగ నియామకాలు, వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎన్ని పగడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ హై టెక్ కాపీయింగ్ కొనసాగుతూనే ఉంది. నీట్ వంటి పరీక్షలు నిర్వహించినప్పుడు అధికారులు ఒంటిపై ఆభరణాలు ధరించిన అభ్యర్థులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదు. చివరికి ఫుల్ హ్యాండ్ షర్ట్ కూడా వేసుకోనీవడం లేదు.

కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ఎన్ని రకాల పద్ధతులు కొనసాగిస్తున్నా హైటెక్ పద్ధతిలో కాపీయింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం టీచర్ల నియామకానికి పరీక్ష నిర్వహించగా హైటెక్ పద్ధతిలో కాపీ కొట్టడానికి ప్రయత్నించి ముగ్గురు అభ్యర్థులు పట్టుబడ్డారు. నిన్న రాజస్థాన్ ప్రభుత్వం రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్(ఆర్ఈఈటీ) నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 16 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ పరీక్షకు ముగ్గురు అభ్యర్థులు బ్లూటూత్ అమర్చిన ఆరు లక్షల రూపాయల విలువైన చెప్పులు ధరించి వచ్చారు. బికనీర్ లోని గంగా షహర్ ప్రాంతంలోని నయా బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హైటెక్ కాపీయింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది.

వారిచ్చిన సమాచారంతో పరీక్ష రాసేందుకు వచ్చిన ముగ్గురు అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ ముఠా నుంచి వీరు రూ. 6 లక్షల చొప్పున బ్లూటూత్ చెప్పులను కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 25మందికి ఈ ముఠా బ్లూటూత్ కలిగిన చెప్పులను విక్రయించినట్లు సమాచారం. అభ్యర్థులకు ఈ చెప్పులను విక్రయించిన గ్యాంగ్ లీడర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.