విశ్వక్ సేన్ చేయలేనిది గోపిచంద్ చేశాడా.. థియేటర్లు తెరుచుకున్నట్లేనా..!

కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత.. థియేటర్లు తెరుచుకోగా సాయి తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటరూ.. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు రావడానికి ఆసక్తి చూపించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా థియేటర్లు తెరుచుకోగానే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. థియేటర్లు తెరుచుకొని సుమారు రెండు నెలలు గడిచినా ఇప్పటిదాకా ప్రేక్షకులు భారీగా తరలి వచ్చింది లేదు.

కొద్ది రోజుల కిందట పాగల్ మూవీ విడుదల కాగా.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘మూసిన థియేటర్లను తెరిపిస్తానని.. లేకపోతే నా పేరు మార్చుకుంటానని’ కామెంట్స్ చేశాడు. కానీ పాగల్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. అయితే విశ్వక్ సేన్ చేయలేనిది మాస్ చిత్రాల హీరో గోపీచంద్ చేసి చూపించాడని అంటున్నారు.

వినాయక చవితి సందర్భంగా గోపిచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. తొలిరోజు ఈ మూవీ రూ. 3.5 కోట్ల షేర్ రాబట్టి కరోనా తర్వాత దేశంలోనే హైయస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటిదాకా రూ.8 కోట్ల షేర్ రాబట్టింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ కలెక్షన్లు పెద్ద లెక్కే కాదు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఇవి మంచి కలెక్షన్లేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి గోపీచంద్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి విశ్వక్ సేన్ చేయలేని పని చేసి చూపించాడని అంతా అంటున్నారు.