ద్వితీయశ్రేణి కేడర్ లో అసంతృప్తి.. గుర్తించని గులాబీ బాస్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నాం.. అయినా మాకు వచ్చిందేమీ లేదు.. మేము బాగుపడిందీ లేదు.. పార్టీ కోసం లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేశాం.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మా వంతు కష్టం మేం పడుతున్నాం.. పక్కనుంచి వచ్చేవాళ్లకే గుర్తింపుఉంది కానీ.. మాకెక్కడ అంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. అక్కడక్కడా ఈ అసంతృప్తి బహిర్గతమవుతున్నా అధినేత దృష్టికి ఈ విషయం వెళ్లడం లేదో.. లేక నాయకులు ఆయన చెవిన వేయడం లేదో తెలియదు కానీ.. అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. దీనికి ఉదాహరణ ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే ఓ సంఘటే.. తమ్మిళ ఎత్తిపోతల పథకం నుంచి ఆర్డీఎస్ కు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి ఇటీవల ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వచ్చారు. అట్టహాసంగా జరిగే ఈ వేడుకకు ఆర్డీఎస్ మాజీ చైర్మెన్ సీతారాం రెడ్డికూడా వచ్చారు. వచ్చీ రాగానే ఆయన నేరుగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. పార్టీకోసం కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా.. నాకేం ఇచ్చారు అని ఎమ్మెల్యేను నిలదీశారు. ఒకవైపు పూజా కార్యక్రమాలు జరుగుతుండగానే ప్రశ్నల వర్షం కురిపించారు. తరువాత మాట్లాడుదాం అంటూ ఎమ్మెల్యే సర్దిచెప్పే యత్నం చేసినా ఆయన వినే ప్రయత్నం చేయలేదు. మిమ్మల్ని గెలిపించుకున్నాం.. మాకేం చేశారు.. మాకు పదవులేమైనా ఇప్పించారా అని అందరిముందూ కడిగిపారేశారు. ఇంకో అడుగు ముందుకేసి.. వాడెవడో కౌశిక్ రెడ్డి వచ్చి ఆరు రోజులు కాకుండానే ఎమ్మెల్సీని చేశారు.. అని అందరూ చూస్తుండగానే దుమ్ముదులిపారు. ఆ ఎమ్మెల్యకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక.. కొబ్బరికాయను సీతారాం రెడ్డికి ఇచ్చి కొట్టించారు. ఇది ఇటీవల బయటకు వచ్చిన ఓ సంఘటన మాత్రమే.. ఇలాంటివి అంతర్గతంగా ఎన్నో..