శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’ ఇప్పటికే సినిమా వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో థియేటర్లలో అదిరిపోయే హిట్ కొడతానంటూ శ్రీవిష్ణు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా థియేటర్ ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే సందేహం సర్వత్రా నెలకొంది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
భాస్కర్(శ్రీవిష్ణు) రోజంతా ఓ జిరాక్స్ షాప్‌లో పనిచేస్తూ, రాత్రుళ్లు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే తాను ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని బిల్డప్ ఇస్తూ సంజనా(మేఘ ఆకాష్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా భాస్కర్‌ను ప్రేమిస్తుంది. అయితే కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి ప్రేమాయణంలో భాస్కర్ ఓ దొంగ అని, అతడికి ఇంతకుముందే విద్య(సునైనా) అనే అమ్మాయితో పెళ్లయ్యి ఓ కొడుకు కూడా ఉన్నాడని సంజనా తెలుసుకుంటుంది. ఇంతకీ భాస్కర్ నిజంగానే పెళ్లి చేసుకున్నాడా? మరి సంజనాను ఎందుకు ప్రేమిస్తాడు? అసలు అతడు దొంగగా మారడానికిగల కారణాలేంటి? చివరకు భాస్కర్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
తన గత సినిమాలతో పోల్చుకుంటే శ్రీవిష్ణు ఈసారి నటనకు స్కోప్ ఉన్న పాత్రను సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా, హీరోగా తనదైన మార్క్ చూపించేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఒక రొటీన్ కథ అయినా కూడా శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను పూర్తిగా తనవైపుకు తిప్పుకుంటాడు. ఇక ఫస్టాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్స్ మినహా, శ్రీవిష్ణు చేసే కామెడీ, అతడి జీవనవిధానాన్ని దర్శకుడు చూపించే వైనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక హీరోయిన్‌తో అతడి లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులకు కొంతమేర నచ్చుతుంది. కానీ చాలా వరకు సీన్స్‌ను ముందే ఊహించేలా ఉండటం ఈ సినిమాకు మేజర్ బ్యాక్‌డ్రాప్ అని చెప్పాలి. కాగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో శ్రీవిష్ణు పాత్రకు సంబంధించి హీరోయిన్ ఓ నిజాన్ని తెలుసుకునే సీన్‌ను పెట్టి ప్రేక్షకులకు సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తాడు దర్శకుడు.

అటు సెకండాఫ్‌లో శ్రీవిష్ణు భార్య, కొడుకు పాత్రలకు సంబంధించిన సీన్స్, తన ప్రేయసిని మెప్పించేందుకు శ్రీవిష్ణు చేసే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ను ఎమోషన్‌తో నింపేసి ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. మొత్తానికి శ్రీవిష్ణు చేసిన ‘రాజ రాజ చోర’ చిత్రం ఓ కామెడీ ఎమెషనల్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
శ్రీవిష్ణు కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు చేసి ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపను తెచ్చుకున్నాడు. అయితే తొలిసారి పూర్తిగా కామెడీ జోనర్ మూవీలో నటించిన ఈ హరో, సినిమా మొత్తాన్ని తన టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్‌తో ముందుకు తీసుకెళ్లాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ హీరోకు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. అటు హీరోయిన్లుగా మేఘా ఆకాష్, సునైనాలకు మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. దీంతో వారిని కూడా ప్రేక్షకులు ఈ సినిమాలో ఖచ్చితంగా గుర్తించారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు హసిత్ గోలి ఈ సినిమాను కామెడీ జోనర్‌లో ఎమోషన్‌ను కలిపి ప్రేక్షకులకు అందించిన విధానం బాగుంది. ఆయన ఎంచుకున్న పాత్రలు, వాటిని ఆయన చూపించిన విధానం పర్ఫెక్ట్‌గా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలను కరెక్ట్‌గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు డైరెక్టర్. అటు వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో బలం అని చెప్పాలి. కొన్ని సీన్స్‌లోని బీజీఎం ప్రేక్షకులకు రిఫ్రెషింగ్‌గా ఉండటం వారిని ఆకట్టుకుంది. పాటలు పర్వాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ బాగున్నాయి.

చివరగా:
రాజ రాజ చోర – కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న శ్రీవిష్ణు

రేటింగ్:
3.5/5.0