హుజూరాబాద్ కారు బెర్త్ ఎవరికో.. అధినేత మదిలో ఏముందో..?

రోజు రోజుకూ హుజూరాబాద్ ఉప ఎన్నికల చర్చ జోరందుకుంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎలాగైనా తమ వశం చేసుకోవాలని కేసీఆర్ శపథం పూనారు. పొరపాటున అక్కడ కారు వెనకబడిందో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే ఎన్నికల్లో విజయం సాధించడానికి కేసీఆర్ దళిత బంధు స్కీం ప్రకటించారు. ఈ పథకంపై ఎవరూ విమర్శించడం లేదు కానీ.. ఇదే స్పీడ్ లో రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో నిలబడే చాన్స్ ఎవరికి ఇస్తారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కీలక నిర్ణయాల్లో కేసీఆర్ ఎవరి అభిప్రాయాలూ తీసుకోరు. సీనియర్ నాయకులు కూడా  ఎదురు చూడటం, ప్రకటిస్తే ఆమోదించడం తప్ప ఏమీ చేయలేరు. 

ముందుగా కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తారని భావించినా అది తప్పని ఎమ్మెల్సీగా ప్రకటించిన తరువాత తేలింది. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణకు చాన్స్ ఉంటుందేమో అని తెలుస్తోంది. అయితే రమణకు కూడా ఆ అవకాశం లభించదని.. కేసీఆర్ ఇతరుల కోసం వెతుకుతున్నరని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే టీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ పేరు కూడా ఇటీవల వినిపిస్తోంది. ఆయనను అభ్యర్థిగా ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఊహాగానాలన్నింటికి గులాబి బాస్ చెక్ పెట్టాలనుకుంటున్నారట. అందుకే దళిత బంధు ప్రారంభోత్సవం రోజైన ఆగస్టు 16న హుజూరాబాద్ లో అభ్యర్థి ఎవరనేది ప్రకటించవచ్చు అని తెలిసింది. ఏది ఏమైనా ఇవన్నీ కేవలం ఊహాగానాలే. సీఎం నోటి వెంట ఎవరి పేరు బయటకు వస్తే వారే అభ్యర్థి.