ఓటుకు నోటు కేసులో అసలైన ట్విస్ట్..

ఓటుకు నోటు కేసు గుర్తందా.. 2015 నాటి ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని, అసలు ఇది అవనీతి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది.

అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ తెలుగుదేశం పార్టీని వీడారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు చేపట్టగా.. సండ్ర కారు జట్టులో చేరారు. అయితే ఈ కేసుకు సంబంధించి సండ్ర సుప్రీం మెట్లు ఎక్కారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో తన పేరును తొలగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. యాక్ట్ 1951 ప్రకారం అసలు ఈ కేసు అవినితి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీంకోర్టు.. ఈనెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈరోజు (బుధవారం) తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం ఇలా అడగటంతో ప్రభుత్వానికి పెద్ద చిక్కొచ్చి పడినట్లయింది. ఒకవేల తెలంగాణ ప్రభుత్వం సండ్ర పేరును తొలగించాలని సిఫార్సు చేస్తే .. రేవంత్ కూడా తన పేరును తొలగించాలని డిమాండ్ చేస్తారు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కావడంతో ఏం చేయాలో కేసీఆర్ కు అంతుచిక్కడం లేదని సమాచారం. ఈ కేసును సుప్రీం కోర్టు సెప్టెంబరు 7కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వ అధికారులు, పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.