ఎస్.. నేనంటే నేనే అంటున్న కేసీఆర్, ఈటల

పేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల నగదు.. ఈ మొత్తంతో దళితులు అభివద్ది చెందుతారు.. అనేక రోజులుగా ఇది నా కల.. ఇప్పటికి ప్రారంభమైంది అని సీఎం కేసీఆర్ చెబుతుండగా.. నేను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు వచ్చింది.. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలి.. ఇది నా క్రెడిట్ అని స్పీచ్ లిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎవ్వరి వల్ల పథకం వచ్చిందనే విషయం పక్కన పెడితే రాజకీయాలు మాత్రం రాష్ట్రంలో వేడెక్కుతున్నాయి. ఈటల డైరెక్టుగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేల్చుతున్నారు.

ఆదివారం జరిగిన కార్యక్రమంలో హరీశ్ రావును కూడా టార్గెట్ చేశారు. దమ్ముంటే.. నాపై పోటీ చేయండి అని కేసీఆర్, హరీశ్ రావులకు చాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన అనంతంర ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తగ్గేదెలే.. అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం కూడా నిత్యం పలువురు మంత్రులు నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసేలా ప్లాన్ రూపొందించింది. ఈటల, మంత్రులు తమ పర్యటనల్లో పలువురిని తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు.

ఇంతమంది మా పార్టీలో చేరారని గులాబీ నేతలు చెబుతుంటే.. మా పార్టీలో ఇంకా ఎక్కువ మంది చేరారని కమలం నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. అనారోగ్యానికి గురై అపోలోలో చికిత్స తీసుకున్న అనంతరం ఈటల జోరు మరింత పెంచారని పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు మరో ముందడుగేసి.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల కేంద్రం హుజూరాబాద్ లో ఎన్నికలు నిర్వహించడం లేదని, కావాలని వాయిదా వేస్తోందని విమర్శిస్తున్నారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరిగే వరకు ఈ పొలిటికల్ హీట్ ఉంటుంది.. అంతే..!