లార్డ్స్ వేదికగా భారత్ విక్టరీ.. బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్ జట్టు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు ఐదో రోజు ఆటలో భారత్ అదిరిపోయే విక్టరీని అందుకుంది. 181/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత ఆటగాళ్లు ఎవరూ ఊహించని విధంగా రాణించారు. ముఖ్యంగా టెయిలెండర్లు భారత స్కోరును పరిగెత్తించారు. దీంతో భారత్ ఐదో రోజున తన రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది.

ఇక 272 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లండ్ జట్టు మొదట్నుండీ తడబడింది. ముఖ్యంగా భారత బౌలర్లు ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ను కూడా పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా క్రమశిక్షణగా బౌలింగ్ వేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలారు. కేవలం 120 పరుగులకు ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ కావడంతో భారత్ 151 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.

లార్డ్స్ మైదానంలో కొట్టిన విక్టరీతో ఐదు టెస్టుల సిరీస్‌‌లో 1-0 తేడాగా ముందంజలో భారత్ కొనసాగుతోంది. మెయిన్ బ్యాట్స్‌మన్లు విఫలమైనా టెయిలెండర్లు రాణించడం భారత జట్టుకు బాగా కలిసొచ్చిందని పలువురు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా డ్రా దిశగా వెళ్తున్న టెస్టు మ్యాచ్‌ను అదిరిపోయే రీతిలో బౌలర్లు తమవైపు తిప్పుకున్నారని వారు అంటున్నారు.