షర్మిల దీక్షా దర్బార్.. అన్న అలా.. చెల్లెలు ఇలా..

దివంగత ముఖ్యమంత్రి కూతురు.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చెల్లెలు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజల కోసం దీక్ష చేయడం మంచి పరిణామమే అయినా.. చేసే విధానం సరిగా లేదని.. హుందాగా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఇపుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పార్టీ అడుగులు సరిగా వేయడం లేదని.. ముఖ్యంగా అధ్యక్షురాలే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అసలు విషయమేమంట.. ప్రతి మంగళవారం దీక్ష పేరుతో వైఎస్ షర్మిల తెలంగాణలో దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా  ఈ మంగళవారం నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ అనే నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించి అక్కడే దీక్ష చేపట్టారు. అయితే దీక్షా కార్యక్రమానికి చేసిన ఏర్పాట్లు చూసి పరిశీలకులే కాదు ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు.   పెద్ద పెద్ద దుప్పట్లు, పెద్ద సోఫా, వాలుగా ఉన్న భారీ దిండు ఉన్నాయి. ఇక సైడ్ దిండ్లు కూడా ఏర్పాటు చేశారు.  ఒక రకంగా చెప్పాలంటే అది ఓ సింహాసనంలా ఉంది అనే చెప్పవచ్చు. దీక్ష అనేది సింపుల్ గా ఉండాలి గానీ ఇంత హంగామా అవసరమా అని విమర్శలు వస్తున్నాయి. జగన్ సీఎం కావడానికి ముందు వివిధ ప్రాంతాల్లో అనేక దీక్షలు చేశాడు. ఆయన కార్యక్రమాలు గానీ, కూర్చునే ప్రాంతం కానీ చాలా సింపుల్ గా ఉండేవి. ప్రజలను కలుసుకోవడానికి అందరితోపాటు కూర్చునేవారు. అయితే షర్మిల దీక్ష పద్దతి మాత్రం విమర్శలపాలైంది. ఒక రాజకీయనేతగా ఎదగాలంటే ప్రజల్లో కలిసి పోవాలి.. అప్పుడే అది సాధ్యం.. ఈ నిజం గుర్తించనంత వరకు నాయకులుగా ఎదగలేరనేది సత్యం.