జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు.

నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని చెప్పుకొచ్చిన జగన్.. 881 అడుగులు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు వస్తాయని.. శ్రీశైలంలో 885 అడుగుల మేర ఎన్నిరోజులు నీళ్లు ఉన్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నీటి విషయంలో వివాదాలు, రాజకీయాలు చేయడం ఏమాత్రం సరికాదన్న ఆయన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాజకీయాల్లో తానెప్పుడూ వేలు పెట్టలేదని.. అటువంటి ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన విస్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్ర పాలకుల మధ్య సఖ్యత ఉండాలని తాము ఎప్పుడూ కోరుకుంటామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Share post:

Latest