తెలంగాణలో డిగ్రీ పరీక్షల వాయిదా….?

తెలంగాణలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల నినాదాలతో విద్యాశాఖ మంత్రి నివాసం దద్దరిల్లుతోంది. తెలంగాణ మంత్రి సబితా ఇంటి వద్ద ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్ టీయూ విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ నిరసనను తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులు వెంటనే ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. అలాగే ఆ పరీక్షలను ఆన్ లైన్ లోనే పెట్టాలని కోరుతున్నారు.

విద్యాశాఖ మంత్రి విద్యార్థి నాయకులతో మాట్లాడారు. ఆ సందర్భంగా విద్యార్థి నాయకులు ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు. అంతకంటే ముందుగా విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శ్రీనగర్ కాలనీలోని సబితా ఇంద్రా రెడ్డి ఇంటి వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. విద్యార్థులతో మంత్రి సబితా మాట్లాడుతూ పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పారు. విద్యార్థులు ఏ విధంగా కోరితే ఆ విధంగా పరీక్షలను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఆ తర్వాత ఆందోళన బాట పట్టినవారిని పోలీసులు కలగజేసుకుని అదుపు చేశారు.