కాకపెంచిన ‘కోకాపేట’..రేవంత్ లాజికల్ పాలిటిక్స్

కోకాపేట భూముల వేలంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలను  రేవంత్‌ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్‌ పాలిటిక్స్‌ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.

హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డవలప్‌మెంట్‌ అథారిటి (హెచ్‌ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతుండగా .. ఇదో పెద్ద స్కాం అని రేవంత్‌ మీడియా ఎదుట కుండబద్దలు కొట్టాడు. 49.92 ఎకరాలు విక్రయించి వెయ్యి కోట్ల రూపాయలు బినామీలకు కట్టబెట్టారని రేవంత్‌ అంటున్నారు. ముఖ్యంగా రామేశ్వర్‌రావు కుమారులకు లబ్ధిచేకూర్చానేది ఆరోపణ.

అయితే రేవంత్‌ విసిరిన ఈ గుగ్లీపై టీఆర్‌ఎస్‌ నేతలెవరూ స్పందించలేదు. కనీసం దాని గురించికూడా మాట్లాడే సాహసం చేయడం లేదు. అయితే…రేవంత్ ఆరోపించారు కాబట్టి టీఆర్ఎస్ నేతలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డిలు రేవంత్ రెడ్డిని ఆదివారం ప్రెస్ మీట్లో షరా మామూలుగానే విమర్శించారు. ఈ విషయం మీడియాలో పెద్దగా కనిపించలేదు. ఈ వ్యవహారంలో రేవంత్‌ మరో అడుగు ముందుకేసి బీజేపీ, కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానని కూడా పేర్కొన్నారు. అంటే టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు బీజేపీని కూడా రేవంత్‌ టార్గెట్‌ చేసినట్లేనని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

ఈ వ్యవహారంపై పోరాటం ఆపబోమని, కేంద్రం చర్యలు తీసుకోకపోయినా, బీజేపీ నేతలు మాట్లాడకపోయినా  వారు కూడా టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైనట్లేనని కొత్తవాదన రేవంత్‌ లాజికల్‌ రాజకీయం తెరపైకి తెచ్చారు. రేవంత్‌ ఆరోపణలపై బీజేపీ నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.  కమలదళం నేతలు కోకాపేట అక్రమాలపై స్పందిస్తే రేవంత్‌ చెప్పింది నిజమైనట్లే.. కాంగ్రెస్‌ ఆరోపణలు సత్యమని ఒప్పుకున్నట్లే. ఒకవేళ స్పందించకపోతే టీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లే అనే వాదన ప్రజల్లోకి వెళుతుందనేది బీజేపీ భయం. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన అనంతరం బీజేపీ ఎలా స్పందిస్తుందో? అంతలోపు కేసీఆర్‌ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే.

Share post:

Latest