సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసారా..?

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా బాటపడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్థానానికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో కర్నాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై యడ్యూరప్ప ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన యడ్యూరప్ప ప్రధానితో అనేక విషయాలపై చర్చించారు. కావేరి జలాల వివాదం, కేరళ-కర్నాటక మధ్య ఉన్న పలు వివాదాలను పరిష్కరించాలని కోరినట్లు తెలుస్తోంది.

కర్నాటక కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో పాటు తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన కుమారుడికి ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మోడీతో భేటీ అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డాను కూడా కలిసి పార్టీ విషయాలు చర్చించారు. అయితే, బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారు పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి. కానీ, ఈ విషయంలో యడ్యూరప్పకు మినహాయింపును ఆల్రెడీ ఇచ్చారు. 2019లో 77 ఏళ్ల వయసులో ఆయన కర్నాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఏజ్ 79 ఏళ్లు. ఇక కర్నాటక సీఎం యడ్యూరప్ప వరుస భేటీలతో కర్నాటక రాజకీయం వేడెక్కిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.