బెంగాల్‌లో జేపీ న‌డ్డా శ‌ప‌థం.. ఏమిటంటే..?

ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కాషాయ‌ద‌ళం ఆశించిన స్థాయిలో సీట్ల‌ను సాధించ‌లేక‌పోయింది. టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేతిలో ఘోర ప‌రాభ‌వాన్ని పొందింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ అనుస‌రించిన దాడులను ఎన్నిక‌ల అనంత‌రం టీఎంసీ నేత‌లు కొన‌సాగిస్తున్నారు. వ‌రుస‌గా బీజేపీ క్యాడ‌ర్‌పై దాడుల‌కు పూనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ హ‌డావుడిగా బెంగాల్‌లో ప‌ర్య‌టించారు. మ‌మ‌తాబెన‌ర్జీ మూడోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజునే ఆయ‌న ఆ రాష్ట్రంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు.

బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో సంద‌ర్భంగా జేపీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కోల్‌కతా నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ హింసాకాండ నుంచి ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని ‘‘కాపాడతామంటూ’’ ఇవాళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శపథం చేయ‌డం గ‌మ‌నార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసను దేశం మొత్తాన్ని తెలియచెబుతామని నడ్డా వివ‌రించారు. ‘‘ఉత్తర 24 పరగణాలు సహా వివిధ జిల్లాల్లో పర్యటించి ఈ దుర్మార్గాన్ని ఎదుర్కొంటున్న పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామ‌ని, దాని గురించి దేశం మొత్తాన్ని చెబుతామ‌ని నడ్డా స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం తర్వాత ఆ పార్టీ రగిలించిన హింస కారణంగా తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపిస్తోంది. ‘‘బెంగాల్ ప్రజలకు మా సేవలు కొనసాగుతాయి. వారి కలలు నెరవేరేవరకు అండగా ఉంటాం. ఈ రాజకీయ హింసా పర్వాన్ని ఛేదించేవరకు మేము పోరాడతామ‌ని నడ్డా స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల వేళ బీజేపీ కొన‌సాగించిన హింసాకాండ సంగ‌తి ఏమిటంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

Share post:

Latest