స‌మంత‌పై మండిప‌డుతున్న తమిళియన్స్..ఏం జ‌రిగిందంటే?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌పై త‌మిళియ‌న్స్ మండిప‌డుతున్నారు. అందుకు కార‌ణం ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలరే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు.

ఈ సిరీస్‌లో స‌మంత కూడా కీల‌క పాత్ర పోషించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ శ్రీకాంత్ తివారీ అనే పోలీస్ పాత్రలో చూపించ‌గా.. సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్రలో చూపించారు. ఉగ్రవాది పాత్రలో స్యామ్ త‌న న‌ట‌నావిశ్వ‌రూపం చూపించింది.

అయితే ఈ ట్రైలర్ చూసిన తమిళియన్స్ సమంతను తిట్టిపోస్తున్నారు. ట్రైలర్‏లో తమిళనాడు ప్రజలను ఉగ్రవాదులుగా చూపించారని..తమిళనాడుకు చెందిన సమంత అలాంటి పాత్ర చేయడం సిగ్గు చేట‌ని త‌మిళియ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ నిలిపివేయాలి.. వెంటనే చిత్రయూనిట్ తమిళియన్స్ కు క్షమాపణ చెప్పాలని భీష్మించుకున్నారు. మ‌రి త‌మిళియ‌న్స్ వ్య‌తిరేక‌త‌ పై మేక‌ర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.