రఘురామ కృష్ణకి షాక్ ఇచ్చిన కోర్టు…?

న‌ర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిష‌న్‌ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన‌ హైకోర్టు పూర్తి వాద‌న‌లు విన్నాక.. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని రఘురామ‌కృష్ణరాజుకు సూచించింది. ఆయనను సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామ‌కృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అద‌న‌పు కోర్టులో ర‌ఘురామ‌ను హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం రాత్రి ఏపీ హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన త‌ర‌ఫున సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ఆదినారాయ‌ణ రావు వాద‌న‌లు వినిపించారు. ప్రాథ‌మిక విచార‌ణ లేకుండా ఎంపీని అరెస్ట్ చేయడాన్ని న్యాయ‌వాది త‌ప్పుబ‌ట్టారు. ర‌ఘురామ అరెస్టుకు స‌హేతుక కార‌ణాలు లేవ‌ని కోర్టుకు వివ‌రించారు. దీనిపై జిల్లా కోర్టుకు ఎందుకు వెళ్లలేదని న్యాయ‌వాదిని హైకోర్టు ప్రశ్నించగా.. కేసు తీవ్ర‌త దృష్ట్యా హైకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభియోగాల‌తో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును సీఐడీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు.