నిర్మాత ఎం.ఎస్‌. ప్రసాద్‌ మృతి..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి రాత్రి ప్రముఖ నిర్మాత మర్రిపాటి సత్యనారాయణ ప్రసాద్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యపాలైన ఆయన గుండెపోటుతో చెన్నైలో కన్ను మూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ఎం.ఎస్‌. ప్రసాద్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1945 జూలై 18న మచిలిపట్నంలో జన్మించిన సత్యనారాయణ ప్రముఖ దర్శకుడు అయిన ఆదుర్తి సుబ్బారావు బావగారు. సుబ్బారావుతో కలిసి కృష్ణ హీరోగా ‘మాయదారి మల్లిగాడు’, ‘గాజుల కిష్టయ్య’ చిత్రాలు నిర్మించారు.

హీరో కృష్ణతోనే ‘రక్త సంబంధం’, ‘పంచాయతీ’, ‘సిరిమల్లె నవ్వింది’ చిత్రాలు తీశారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘మన్మథ లీల కామరాజు గోల’, ‘రంభ రాంబాబు’ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాలు గొప్ప ప్రజాధరణను పొందాయి. ఈ సినిమాలకు రాజేంద్రప్రసాద్‌ హీరోగా పనిచేశారు. సినిమాలు నిర్మించిన తర్వాత ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌గా పరిశ్రమలో ముందుకు సాగారు. ఎం.ఎస్ ప్రసాద్ గా పేరుపొందిన ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.