అగ్ర‌న‌టులు ముంద‌జ‌.. ఖుష్బూ వెనుకంజ‌

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయ‌గా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని కూటమి నుంచి విజయకాంత్‌ అధ్యక్షుడిగా ఉన్న డీఎండీకే పోటీకి దిగింది. నామ్‌ తమిళర్‌ కట్చి అధినేత సీమాన్‌ నేతృత్వంలో మరో కూటమి బరిలోకి దిగింది.

రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొన్నా అధికార పీఠం మాత్రం డీఎంకే కైవ‌సం చేసుకునే అవ‌కాశాలు స్ప‌ష్టం గా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా త‌మిళ‌నాట ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 72.81 శాతం పోలీంగ్ న‌మోదు కాగా, స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం కనబరుస్తున్న‌ది. డీఎంకే ఆధిక్యం-107, అన్నాడీఎంకే- 70 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేసిన అగ్ర‌న‌టుడు కమల్‌హాసన్ ముందంజ‌లో దూసుకుపోతున్నారు. థౌజండ్ లైట్స్ నుంచి పోటీచేసిన న‌టి ఖుష్బు వెనుకంజ ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా కేర‌ళలో బీజేపీ త‌ర‌పున‌ త్రిసూర్ నుంచి బ‌రిలో దిగిన మ‌ల‌యాళి అగ్ర‌న‌టుడు సురేష్‌గోపీ సైతం ముందంజ‌లో కొన‌సాగుతున్నారు. మొత్తంగా ఎల్డీఎఫ్ 78 స్థానాల్లో ఆదిక్యంలో కొన‌సాగుతున్నారు. యూడీఎఫ్ 60 చోట్ల దూసుకుపోతున్న‌ది.