95శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు.. రూట్ క్లియ‌ర్‌..!

సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. దశాబ్దాల ఆకాంక్ష నెర‌వేరింది. తెలంగాణ యువ‌త‌కు కేంద్రం తీపి క‌బురును అందించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు ఆమోదం తెలిపింది. ఫ‌లితంగా ఇక‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే నియ‌మాకాల్లో 95శాతం స్థానికుల‌కే ద‌క్క‌నున్నాయి. అదేవిధంగా జిల్లాల ఏర్పాటుపైనా సుముఖ‌త వ్య‌క్తం చేసింది. ఆమోదింది నోటిఫికేష‌న్ విడుద‌ల చేయగా, అందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌పై రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర కూడా వేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి త‌రువాత తెలంగాణ‌లో 31 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. 2018లో కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు కేంద్రం ఆమోదం ల‌భించింది. అయితే త‌ర్వాత ప్ర‌భుత్వం కొత్త‌గా వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చడంతో పాటు రెండు జిల్లాల‌ను అద‌నంగా ఏర్పాటు చేసింది. వాటికి రాష్ట్ర‌ప‌తి ఆమోదం అవ‌స‌ర‌ముండ‌డంతో ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంది.

ఇదిలా ఉంటే సుమారు 7 ఏళ్లు నిరీక్ష‌ణ అనంత‌రం జోన‌ల్ వ్య‌వ‌స్థ‌పై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. తాజాగా కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు రాష్ట్ర‌పతి ఆమోద ముద్ర వేయ‌డంతో మార్గం సుగ‌మ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. గ్రూప్‌–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్‌ కోటాలోనే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. అయితే ఇక‌పై ఆ అవ‌కాశం ఉండ‌దు.. ఓప‌న్ కోటా కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఉంటుంది. గ్రూప్‌–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్‌ పోస్టులు ఉండేవి. మల్టీజోన్‌ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్‌లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు. ఇక‌పై తెలంగాణ‌లో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌చే భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్‌ కోటా 5 శాతం మాత్రమే ఉండ‌నుండ‌గా, పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొన‌సాగ‌నుంది.

Share post:

Latest