రైలుకు ఎదురెల్లి ఉద్యోగి సాహ‌సం.. మంత్రి ప్ర‌శంస‌లు

మాములుగా ప్ర‌భుత్వ ఉద్యోగులు అంటేనే ప‌నిచేయ‌రు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం సాగుతుంటుంది. కానీ ఓ రైల్వే ఉద్యోగి చేసిన సాహాసం తెలిస్తే మీ అభిప్రాయాన్ని క‌చ్చితంగా మార్చుకుంటారు. ఆ ఉద్యోగిని అభినందించక మాన‌రు. సినీఫ‌క్కీలో ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి మ‌రీ బాలుడి ప్రాణాల‌ను కాపాడాడు మ‌రి. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన రైల్వే మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగిని ప్రశంసించ‌డంతో పాటు బహుమతి ప్రకటించింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

మ‌హారాష్ట్ర థానేలోని వాంగని రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్ 17న ఓ బాలుడిని ఎత్తుకుని ఓ మహిళ వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురు వెళ్తున్న‌ది. ఆ సమయంలో ఆమె చేతిలోని బాలుడు జారిపోయి రైలు పట్టాలపై పడిపోయాడు. అక్కడే పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్న మయూర్ షెల్కే దీనిని గమనించాడు. అంతే క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా తన ప్రాణాలను సైతం పట్టించుకోకుండా ముందుకు మెరుపువేగంతో క‌దిలాడు. పట్టాలపై పడిపోయిఎత్తయిన ప్లాట్‌ఫాంపైకి ఎక్కేందుకు చాలా శ్రమిస్తున్న బాలుడివైపు వెంట‌నే పైకి చేర్చాడు. ఆ త‌ర్వాత తాను బ‌య‌ట‌కు రావ‌డం,, ఆ వెంట‌నే వెంట్రుకవాసి తేడాలో రైలు వేగంగా దూసుకెళ్ల‌డం జ‌రిగింది. క్ష‌ణం ఆల‌స్య‌మైనా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ సంఘటనంతా అక్క‌డే ఉన్న ఎవ‌రో వీడియో తీసి పోస్ట్ చేయ‌గా, అది సామాజిక మాధ్యమాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇదిలా ఉండ‌గా సమయోచితంగా వ్యవహరించి, బాలుడిని కాపాడినందుకు ఉద్యోగి మయూర్ షెల్కేను రైల్వే మంత్రిత్వ శాఖ అభినందించింది. రూ.50 వేలు బహుమతిగా ప్రకటించింది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మయూర్ షెల్కే సాహసోపేత చర్యను ఓ ట్వీట్ ద్వారా ప్రశంసించారు. యావత్తు రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనను చూసి గర్విస్తోందని కీర్తించారు. అదీగాక క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా కూడా షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసించారు. ఆయనకు జావా మోటార్‌ సైకిల్‌ను బహుమతిగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.