టీనేజీ కుర్రాడు.. ఆ ప‌నుల్లో మాత్రం ఘ‌నుడు..

ఇదంతా టెక్ యుగం. పుట్టిన‌ప్ప‌టి నుంచే డిజిట‌ల్ నాలెడ్జిని నేర్చుకుంటున్నారు. వ‌య‌స్సును చూసి ఈత‌రం పిల్ల‌ల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌త‌ర‌మే. సాంకేతిక ప‌రిజ్ఞానంలో దిట్ట‌లుగా మారుతున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా అది ప‌క్క‌దారి ప‌డుతుండ‌డ‌మే ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ బాలుడి ఉదంతం. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ వైద్య‌విద్యార్థినికి చుక్క‌లు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అస‌లు విష‌యం తెలిసి పోలీసులు నివ్వెర‌పోయారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. సిటీకి చెందిన ఓ యువతి వైద్య విద్యనభ్యసిస్తున్న‌ది. ఆమెకు చెందిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో పాటు తొలగించడం కోసం ఆమె తన పక్కింట్లో ఉండే ఓ బాలుడి సహాయం తీసుకున్న‌ది. అప్ప‌టి నుంచి బాలుడితో ఆ యువతి స్నేహంగా, ఆత్మీయంగా మెలిగేది.

- Advertisement -

ఇదిలా ఉండ‌గా ఇదే అదునుగా స‌ద‌రు బాలుడు ఆ యువ‌తి ఈ– మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తదితరాలను సంగ్రహించాడు. దాని ద్వారా ఆమె ఆన్‌లైన్‌ క్లాసుల్లోకి అక్రమంగా ప్రవేశించి ఆమె ఫొటోలను తన అధీనంలోకి తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ క్లాసుల్లో ఆమె పోస్టు చేస్తున్నట్లు అసభ్య, అశ్లీల ఫొటోలు షేర్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. తన వద్ద ఉన్న మెయిల్‌ వివరాల ఆధారంగా వారి ఇంటి వైఫై కనెక్షన్‌ను యాక్సెస్‌ చేసి ఫోన్లు హ్యాంగ్‌ అయ్యేలా చేయ‌డంతో పాటు, యువ‌తి ఫేస్‌బుక్‌ ఖాతాను యాక్సెస్ చేసి ఆమె పోస్టు చేస్తున్నట్లు అసభ్య, అశ్లీల ఫొటోలు షేర్‌ చేసేవాడు. నిజం తెలియ‌ని ఆ యువ‌తి తిరిగి ఆ బాలుడి వద్దకే వచ్చి విషయం చెప్పేది. ఫేస్‌బుక్‌ ఖాతా బ్లాక్‌ చేయాలని కోర‌డం, ఆమె ముందు అలాగే చేసి, ఆమె వెళ్లిన త‌రువాత తిరిగి యాక్టివ్‌ చేసే వాడు. ఇక సైబర్‌ వేధింపులతో విసిగివేసారిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పూర్వాపరాలు పరిశీలించి ఇదంతా చేసింది యువతి పక్కింటి బాలుడేన‌ని గుర్తించి నోరెళ్ల బెట్టారు. బాలుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు అబ్జర్వేషన్‌ హోమ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే యువ‌తితో పాటు వారి కుటుంబికుల, బంధువుల‌ వివరాలను కూడా త‌స్క‌రించాడు. వారికి మెయిల్‌ చేసి తమ ఫోన్లు హ్యాక్‌ అయినట్లు భావించేలా చేస్తూ తనలో తాను వికృతానందం పొందేవాడ‌ని విచార‌ణ‌లో తేల‌డం గ‌మ‌నార్హం.

Share post:

Popular