లంగ‌ర్‌హౌజ్‌లో కారు బీభ‌త్సం.. రోడ్డుపై ప‌ల్టీలు

అతివేగం.. మ‌ద్యం తాగి వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు వాటిల్లుతున్నాయి. ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ట్టాల‌ను సైతం తీసుకొచ్చారు. జ‌రిమానాల‌ను భారీగానే పెంచాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రిలో మార్పు రావ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డుపుతూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. వాహ‌న‌దారుల‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వివ‌రాల్లోకి వెళ్లితే..

హైద‌రాబాద్ నగరంలోని లంగర్ హౌజ్ వద్ద ఓ కారు శుక్ర‌వారం ఉద‌యం బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు.. అక్క‌డి మెట్రో రైల్వే లైన్ 100వ‌ పిల్లర్ నెంబర్ వద్ద ఉన్న డివైడర్‎ను బ‌లంగా ఢీకొట్టి సినిమాల్లో మాదిరిగా గాలిలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి. ఊహించ‌ని సంఘ‌ట‌న‌తో వాహ‌న‌దారులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. స్థానికులు వెంట‌నే తేరుకుని గాయాలైన యువకుడిని హుటాహుటిన వైద్య‌శాల‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, మద్యం మత్తులో యువ‌కుడు కారు నడుపుతున్నట్లు అధికారులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో వెల్లడి కావ‌డం గ‌మ‌నార్హం.