గ‌ర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్ద‌రి మిత్రుల గ్యాంగ్ ఫైట్‌..!

టీనేజ్ కుర్రాలు క్ష‌ణికావేశంలో జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో కాలాన్ని వృథా చేయ‌డంతో పాటు అందుకోసం ఎంత‌కైనా తెగిస్తున్నారు. ఒక గ‌ర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్ద‌రు మిత్రులు ఏకంగా కాలేజీ గ్రౌండ్‌లో గ్యాంగ్‌ఫైట్‌కు దిగారు. బ్లేడ్‌తో దాడి చేయ‌గా ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఒక బాలుడికి తీవ్ర‌గాయాలు పాలై వైద్య‌శాల‌లో చేర‌డంతో అస‌లు విష‌యం వెలుగుచూసింది. ఈ సంఘ‌ట‌న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. రహ్మత్‌నగర్‌ బంగారు మైసమ్మ టెంపుల్‌ వద్ద నివసించే సాయి చైతన్య(19) ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన అక్క కూతురు(17)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ విష‌యం ఆమెకు తెలిపేందుకు జంకుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే తన ప్రేమకు సహకరించాల్సిందిగా స్నేహితులైన ఇద్దరు బాలురు (17)ను సాయిచైతన్య కోరాడు.

- Advertisement -

ఇదిలా ఉండ‌గా స‌ద‌రు బాలురు చైతన్యను మోసగించి వారే ఆ యువతితో ప్రేమాయణం నడిపిండం మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల ఏకంగా ‘నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా.. నా కోసం నీ ప్రేమను త్యాగం చేయ్‌… లేకపోతే బాగుండదు’ అంటూ చైత‌న్య‌కు అత‌ని స్నేహితుడు వాట్స‌ప్‌ మెసేజ్‌ పెట్టాడు. స్నేహితుడి న‌మ్మ‌క ద్రోహానికి ఆగ్రహానికి గురైన చైత‌న్య ఎల్‌ఆర్‌ కిషోర్‌ స్కూల్‌ సమీపంలోని గ్రౌండ్‌కు వస్తే తేల్చుకుందామని త‌న స్నేహితుల‌ను హెచ్చరించాడు. స్నేహితులతో పాటు చైతన్య గ్రౌండ్‌కు వెళ్లారు. అక్క‌డ‌ వారి మధ్య వాగ్వాదం జరిగ‌గా, సాయిచైతన్య తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో స్నేహితుల్లోని ఓ బాలుడి మెడపై గాట్లు పెట్టాడు. తీవ్ర రక్తస్రావంతో వైద్య‌శాల‌లో చేరిన ఆ బాలుడు ఆ త‌రువాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సాయి చైతన్యపై ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసిన‌ పోలీసులు వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. అయితే తనను చంపేస్తానని బెదిరించడంతో ముందుగానే స్నేహితుడిని చంపేందుకు బ్లేడ్‌తో దాడి చేశానని నిందితుడు చైతన్య తెలిప‌డం గ‌మ‌నార్హం.

Share post:

Popular