కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర చాలా చీప్‌.. ఎంతో తెలుసా..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. మ‌రోవైపు ఆక్సిజ‌న్‌, టీకాల కొర‌త నెల‌కొంది. ఇదే అదునుగా ప్రైవేట్ ద‌వాఖానాలు దోపిడీకి తెగ‌బ‌డుతున్నాయి. వంద‌ల్లో ఉన్న టీకాను వేల రేటుకు విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోవీషీల్డ్ ఉత్ప‌త్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.400కు, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌ల‌కు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వ‌నున్న‌ట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఈ మేర‌కు సీరం సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగానూ అందుబాటులో ఉన్న విదేశీ టీకాల‌ను దృష్టిలో పెట్టుకుని, భారతీయుల‌కు ఆమోద‌యోగ్య‌మైన ధ‌ర‌లో టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుత మార్కెట్‌లో అమెరికా టీకాల ధ‌ర రూ.1500, ర‌ష్యా టీకాలు రూ.750, చైనా టీకాలు రూ.750గా ఉన్న‌ట్లు పూనావాలా ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు.

అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, వ్యాక్సినేష‌న్ కేంద్రాలు, ప్రైవేటు హాస్పిట‌ళ్లు నేరుగా వ్యాక్సిన్ కోనుగోలు చేసుకునేందుకు వెస‌లుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు సీరం సంస్థ వెల్ల‌డించింది. రానున్న రెండు నెల‌ల్లో కోవీషీల్డ్ టీకాల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచ‌నున్న‌ట్లు ఆధార్ పూనావాలా స్ప‌ష్టం చేయ‌డంతో పాటు త‌మ ఉత్ప‌త్తిలో 50 శాతాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియకు, మిగ‌తా 50 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు అందిస్తామ‌ని వెల్ల‌డించారు. మ‌రో నాలుగైదు నెల‌ల్లో రీటేల్ రంగంలోనూ టీకాల‌ను అమ్మ‌నున్న‌ట్లు సీరం సీఈవో వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రికి సాయం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని, అయితే ప్ర‌జ‌లు కాస్త స‌మ‌య‌మ‌నంతో ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలా ఉండ‌గా మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ వాక్సిన్ల కొరత లేదన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్ప‌ష్టం చేశారు. రెమిడిసివర్ ఇంజెక్షన్స్ ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుబాటులో ఉందన్నారు. డాక్టర్లు ఆక్సీజన్‌ని వృథా చేయవద్దని, పొదుపుగా వాడాలని కోరారు. ఆక్సిజన్ సరఫరాపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తాను దృష్టి సారించామని ఈటల ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.