ప్రేమికుడికి పోలీసుల హార్ట్ ట‌చ్ రిప్ల‌య్‌.. నెటిజ‌న్లు ఫిదా

క‌రోనా మ‌హ‌మ్మారి ఒక‌వైపు ప్ర‌జల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్న‌ది. అదేవిధంగా ప్రేమ‌కుల‌కు తీర‌ని క‌ష్టాల‌ను తెచ్చిపెడుతుంది. క‌లుసుకోలేని ప‌రిస్థితి క‌ల్పించింది. ఒక‌రినొక‌రు చూసుకోలేక‌పోతున్నారు. ఈ ఎడ‌బాటును త‌ట్టుకోలేక అనేక మంది వేద‌న‌తో న‌లిగిపోతున్నారు. అలాంటి విర‌హ‌వేద‌న‌తో న‌లిగిపోతున్న ఓ ప్రేమికుడు నేరుగా పోలీసుల‌నే ఆశ్ర‌యించాడు. స‌ద‌రు ప్రేమికుడి బాధ‌ను అర్థం చేసుకోవ‌డంతో పాటు, అత‌ని మెసేజ్‌కు పోలీసులు హ‌ర్ట్ ట‌చ్ రిప్ల‌య్ ఇచ్చారు. దీనికి నెటిజ‌న్లు ఫిదా అవ‌డంతో పాటు పోలీసుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే..

ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరిస్తారు. వారు నెటిజన్లకు ఫన్నీ జవాబులు ఇస్తూనే వారికి విషయం పట్ల అవగాహన కల్పించ‌డంలో ముందుంటారు. ఇక ప్ర‌స్తుత‌తం ముంబయిలో కోవిడ్ తొ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ లాక్ డౌన్ విధించారు. కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో అశ్విన్ వినోద్ అనే ఓ యువకుడు ముంబయి పోలీసులకు ఓ అభ్యర్దన చేశాడు.” నా గర్ల్ ఫ్రెండ్ ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆమెను మిస్ అవుతున్నాను. అందుకే, బయటకు వెళ్లి ఆమెను కలవడానికి నేను నా వాహనానికి ఏ స్టిక్కర్ ఉపయోగించాలి?” అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రేమికుడి ట్వీట్‌కు పోలీసులు హార్ట్ ట‌చ్ రిప్ల‌య్ ఇచ్చారు. “ఇది మీకు చాలా అవసరం అని మేము అర్థం చేసుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు ఇది మా నిత్యావసరాలు లేదా అత్యవసర వర్గాల పరిధిలోకి రాదు! దూరం హృదయాన్ని బాగా విశాలం చేస్తుంది. మీరు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలానే ఉండండి.” అంటూ బ‌దులివ్వ‌డ‌మే గాకుండా “మేము మీ ఇద్దరూ కలిసి జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాము. అందులో ఇది ఒక దశ మాత్రమే.” అంటూ ముక్తాయించారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ముంబయి పోలీసులు ఇచ్చిన వేగవంతమైన, సున్నితమైన సమాధానంపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.