రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నారనే విషయంలో ఏ ఒక్కరికీ సందేహం లేదు. నిజానికి ఈ మాట విపక్షం వైసీపీలోని సగానికిపైగా నేతలు అంగీకరిస్తున్నదే. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు కావాల్సిందే. ముఖ్యంగా విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. లోటు బడ్జెట్ సహా ఖర్చులు, సామాజిక అభివృద్ధి పథకాలు వంటివి ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణ ద్వారానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని భావించారు సీఎం. దీంతో ఆయన పెట్టుబడులపై దృష్టి పెట్టారు.
వివిధ దేశాలను ఏపీకి ఆహ్వానించి పరిస్థితులు వివరించి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. ఇక, ఇప్పుడు సింగపూర్లో జరుగుతున్న సదస్సును కూడా రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకునేందుకు రెడీ అయ్యారు. ‘ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ సింగపూర్’ అనే సంస్థ సింగపూర్లో మౌలిక సదుపాయాల కంపెనీల అంతర్జాతీయ రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహిస్తోంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఈ సదస్సుకు ఏపీ నుంచి ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆదివారం బయలుదేరి వెళ్లింది.
ఈ బృందానికి సీఎం పలు సూచనలు చేశారు. ‘పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం కావాలి. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించండి. మౌలిక సదుపాయాల సంస్థలను ఆకర్షించండి.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వైజాగ్లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒక్క అమరావతికి సంబంధించే రూ.1.25 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని, సింగపూర్ రౌండ్ టేబుల్ సదస్సులోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు.
అమరావతిలో ఉన్న అపార అవకాశాలను ఈ సదస్సుకు హాజరైన పెట్టుబడిదారులకు వివరించాలని కోరారు. భారతదేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సిటీ అమరావతి అని, ఈ విషయాన్ని పెట్టుబడిదారులకు తెలియజేయాలని, అంతర్జాతీయ మౌలిక సదుపాయాల కంపెనీలను ఏపీకి తీసుకురావాలని సూచించారు. ‘నేను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో రహేజా కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయించడానికి స్వయంగా పైలు పట్టుకుని ముంబైకి వెళ్లాను. నా మాటలను వారు విశ్వసించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఎకరా కేటాయింపునకు వంద ఉద్యోగాల చొప్పున ఇవ్వాలని షరతు పెట్టాను. ఇప్పుడు హైదరాబాద్కు రహేజా ఒక వరంగా మారింది’ అని సీఎం వివరించారు. మొత్తంగా సీఎం అభివృద్ధి మంత్రానికి పెట్టుబడులు కలిసొస్తే.. ఏపీకి తిరుగుండదు!