దేశమంతా వచ్చే ఎన్నికల నాటికి కాషాయ జెండా రెపరెపలాడించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా!! ప్రస్తుతం ఆయన తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా అక్కడ కమలానికి కొత్త ఉత్సాహాన్ని నింపాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలో అక్కడ పర్యటించబోతున్నారు. అయితే అంతకంటే ముందే తెలంగాణలో భారీగా వలసలు జరగవచ్చనే ప్రచారం జోరందుకుంది. అనుకున్న స్థాయిలో బలపడేందుకు అంతే స్థాయిలో వలసలను కూడా ప్రోత్సహించాలని బీజేపీ నాయకత్వం బలంగా నమ్ముతోందట. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి కొంత మంది కీలకనేతలు వెళ్లవచ్చని తెలుస్తోంది.
`ఆపరేషన్ ఆకర్ష్`తో తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ నేతలను కారులో ఎక్కించేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్ నిలిచింది. ఇదే సమయంలో అన్ని వర్గాల వారినీ తన వైపు తిప్పుకునేందుకు ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను ఢీకొట్టి బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికలకు చాలా ముందే కొత్త రాష్ట్రంలో తమ పట్టు బిగించేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. మే చివరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది.
తెలంగాణ ప్రాంతంలో రకరకాలుగా రాజకీయ సమీకరణాలను మార్చాలన్నది అమిత్ షా ప్లాన్. దేశమంతా బీజేపీ హవా నడుస్తున్న.. తరుణంలో తెలంగాణలోనూ కర్ఛీఫ్ వేసేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. దీంతో పాటే తెలంగాణను నెమ్మది నెమ్మదిగా కబ్జా చేయాలంటే ఇక్కడ భారీగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలన్నది భాజపా ప్లాన్. ఆ మేరకు కాంగ్రెస్ లోని బీసీ నేతలకు గాలం వేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రలో కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన తెలంగాణ -బీసీ నేతలు .. మాజీ మంత్రులు దానం నాగేందర్ , ముఖేష్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
ఇప్పటికే ఈ ముగ్గురు నాయకులు స్థానిక బీజేపీ నాయకులతో టచ్‌లోనే ఉన్నారట. బాజపా ఎన్నికల ఫ్యూహకర్త రాంయాదవ్తో ఇదివరకే వీరు మంతనాలు జరిపారు. దీంతో భాజపా బలం పెరుగుతున్నట్టేనని ముచ్చటించుకుం టున్నారు. అమిత్ షా సమావేశం సందర్భంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే ఛాన్సుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇక ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కూడా తాము ఎన్‌క్యాష్ చేసుకునేందుకు కూడా తెలివిగా పావులు కదుపుతోందట. మొత్తానికి తెలంగాణలో పాగా వేసేందుకు పెద్ద వ్యూహమే వేశారు అమిత్ షా! మరి వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్ ముందు ఇవన్నీ ఫలిస్తాయో లేదో!!