కొద్ది రోజులుగా బాహుబలి 2 విషయంలో మెగా ఫ్యాన్స్ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి 2 విషయంలో ప్రభుత్వం అదనపు షోలకు అనుమతులు ఇవ్వడం సరికాదని… బాహుబలి 2పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అంత ప్రేమ ఎందుకని… తొలి పది రోజులు బాహబలి 2 సినిమాను మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ చూడొద్దని వారు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పోలీసులు సైతం గతంలో గొడవల దృష్ట్యా ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ సంఘాల నాయకులను పిలిచి మరీ సమావేశాలు పెట్టి శాంతియుతంగా ఉండాలని చెప్పారు.
అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం కవ్వింపు చర్యలకు దిగారు. ఈస్ట్ గోదావరిలోని అమలాపురంలో మెగా ఫ్యాన్స్ బాహుబలి 2 రిలీజ్ అడ్డుకోవడంతో పట్టణమంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి బాహుబలి 2 సినిమాను గత రాత్రి 10 గంటలకే చాలా చోట్ల ప్రదర్శించేశారు. అమలాపురంలో మాత్రం మెగా ఫ్యాన్స్ ముందుగా షోలు పడడానికి వీళ్లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు బాహుబలి ఫ్యాన్స్ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీలతో తమ నిరసన తెలిపారు.
ప్రభుత్వం శుక్రవారం నుంచి 6 షోలకు అనుమతులు ఇచ్చిందని, టిక్కెట్టు రేటు ప్రభుత్వం రూ.200గా నిర్ణయిస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని సినిమాను ఒంటిగంట దాటిన తర్వాతే ప్రదర్శించాలంటూ ఆందోళనకు దిగారు. అవసరమైతే బాహుబలి ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా వారు వార్నింగ్ ఇవ్వడంతో ఇటు ప్రభాస్, బాహుబలి ఫ్యాన్స్‌కు అటు మెగా ఫ్యాన్స్ మధ్య వార్తో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు చాలా సేపటి తర్వాత పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.