`స్పైడర్` బిజినెస్ మొదలైంది. ఊహించని రీతిలో అటు టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ ను తన ఉచ్చులో బిగించేందుకు సిద్ధమవుతోంది. ప్రిన్స్ మహేశ్‌బాబు మరోసారి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బ్రహ్మోత్సవం నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు ఈసారి సూపర్ హిట్ సినిమాతో అలరించేందుకు అన్ని హంగులతో `స్పైడర్`లా రెడీ అయ్యాడు. ఈసినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఉండగా.. ఫస్ట్‌లుక్ చూసిన అభిమానులకు ఈ ఆశలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు స్పైడర్ శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం చక్కెర్లు కొడుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై.. భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉంది చిత్ర యూనిట్.
ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా `స్పైడర్` బిజినెస్ స్టార్ట్ చేసేసింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ.150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. స్పైడర్ శాటిలైట్ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి ఓ చానల్ సొంతం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ రైట్స్ కలిపి మొత్తం రూ. 26 కోట్లు శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించారట. అయితే ఈ ఆఫర్‌పై యూనిట్ సభ్యులు అధికారికంగా నోరుమెదపడం లేదు.