ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పటి వరకు ఈగైనా వాలకుండా చూసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ఇప్పడు బాబుకు కటీఫ్ చెబుతున్నాడా? 2014లో బాబు పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పవన్.. ఇప్పడు అనూహ్యంగా బాబుకు గుడ్‌బై చెబుతున్నాడా? ఆది నుంచి జగన్ గురించి ఎలాంటి వైఖరినీ చెప్పకుండానే బాబు కు మాత్రమే ఓట్లేయాలంటూ పరోక్షంగా జగన్ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైన పవన్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. నిన్నగాక మొన్న మీడియాతో మాట్లాడిన పవన్ ఈ విషయంపైనే క్లారిటీ ఇచ్చారు.
రెండు రోజుల కిందట తమ సమస్యలు చెప్పుకొనేందుకు చేనేత సంఘాలు పవన్‌ని కలిశాయి. ఈ సందర్భంగా తమ కష్టాలు పెరుగుతున్నాయని, ఆదుకోవాలని వారు కోరారు. దీనికి స్పందించిన పవన్ హోదా మొదలు కొని ప్రత్యేక ప్యాకేజీ వరకు జరిగిన తతంగాన్ని మీడియా ముందు ఏకరువు పెట్టాడు పవన్. నిజానికి ఏపీ అభివృద్ధి కోసమే తాను మద్దతిచ్చానని ఎప్పటికప్పుడు చెప్పుకొచ్చే పవన్.. ఈ దఫా కూడా అదే డైలాగ్ చెప్పాడు. అంతేకాకుండా ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతోందంటే.. తాను ఎవరితోనైనా కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ ప్రకటించారు.
ఎవరితోనైనా అంటే .. జగన్‌తో కలిసి పోరాడతారా? అని మీడియా ప్రశ్నించగా. ఎందుకు పోరాడకూడదు అని పవన్ ఎదురు ప్రశ్నించాడు. దీంతో పవన్ వ్యూహం మారిందని, బాబుతోనే కలిసి ప్రయాణం సాగిస్తే.. ప్రజల్లో తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడనుందని ఈ క్రమంలోనే ప్రజల కోసం నిజంగా ఉద్యమించే నేతలతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్టు పవన్ సన్నిహితులు చెబుతున్నారు.
తొలుత పవన్ ను జగన్ వద్దకు తీసుకెళ్లే చొరవను ఒక డాక్టర్ చూపారని సమాచారం. జగన్ కు కూడా సుపరిచితుడు అయిన ఈ వైద్యుడు.. వీళ్లిద్దరి సమావేశానికీ మధ్యవర్తిత్వం చేశాడు. దీంతో ఈ నెల 8న పవన్-జగన్ భేటీ జరగనుందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. రాష్ట్రంలో చంద్రబాబు కంటిపై కనుకు కరువవుతుందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.