హోం మంత్రి ఛాన్స్ మిస్ అయిన విజ‌య‌శాంతి

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజ‌య‌శాంతి టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు ధీటుగా ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఘ‌న‌త ఆమె సొంతం. లేడీ అమితాబ‌చ్చ‌న్‌గా పేరున్న విజ‌య‌శాంతి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ వ‌రుస‌గా వేసిన రాంగ్ స్టెప్పుల‌తో పొలిటిక‌ల్ ప్లాప్ షో వేశారు. త‌ల్లి తెలంగాణ – బీజేపీ – టీఆర్ఎస్ – కాంగ్రెస్ ఇలా ఆమె అన్ని పార్టీల కండువాలు మార్చేశారు.

మెద‌క్ నుంచి 2009లో టీఆర్ఎస్ త‌ర‌పున ఎంపీగా గెలిచిన ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లోకి జంప్ చేసి మెద‌క్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉంటే విజ‌య‌శాంతి తాజాగా చెన్నై వెళ్లి అమ్మ జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె జ‌య స‌న్నిహితురాలు శ‌శిక‌ళ‌ను క‌ల‌వ‌డం ఆమెకు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం చూస్తే… ఆమె అన్నాడీఎంకేలోకి వెళ్లి ఆ పార్టీ త‌ర‌పున త‌మిళ‌నాడు నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ‌తార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌లు ఎలా ఉన్నా విజ‌య‌శాంతి పార్టీలు మార‌కుండా ఏదో ఒక పార్టీనే న‌మ్ముకుని ఉంటే ప్ర‌స్తుతం ఆమె ఖ‌చ్చితంగా మంత్రి అయ్యి ఉండేవార‌న్న చ‌ర్చ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. విజ‌య‌శాంతి బీజేపీలో ఉండి ఉంటే ప్ర‌స్తుతం ఆమె రాజ్య‌స‌భ‌కు ఎంపికై ఎంచ‌క్కా కేబినెట్ మినిస్ట‌ర్ కాక‌పోయినా ఏ స‌హాయ మంత్రో అయ్యి ఉండేవారు. అలా కాకుండా ఆమె టీఆర్ఎస్‌లోనే ఉండి కేసీఆర్ చెప్పిన‌ట్టు చెస్తే ఆమెకు కేసీఆర్ హోం మంత్రి ఇద్దామ‌నుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక త‌న స‌న్నిహితుల‌తో సైతం ఆయ‌న చెప్పార‌ట‌.

అయితే విజ‌య‌శాంతి ఎంపీ అవ్వ‌గానే రాజ‌కీయంగా త‌న‌ను కేసీఆర్ తొక్కేస్తున్నార‌ని ప‌దే ప‌దే టీఆర్ఎస్ నాయ‌కుల వ‌ద్ద అన‌డంతో ఆ విష‌యం కేసీఆర్ దాకా చేరి ఆమెను ప‌క్క‌న పెట్టేశార‌ని స‌మాచారం. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి ఆ పార్టీలోకి జంప్ చేసిన ఆమె అక్క‌డ మంత్రి ప‌ద‌వి పొంద‌వ‌చ్చ‌ని ప్లాన్ వేశారు. అయితే ఆమె ప్లాన్ కాస్త తిర‌గ‌బ‌డి కాంగ్రెస్‌, ఆమె ఇద్ద‌రూ ఓడిపోయారు. అప్ప‌టి నుంచి రాముల‌మ్మ అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజ‌కీయాల్లోనూ క‌నిపించ‌కుండా పోయారు.

సో విజ‌య‌శాంతి బీజేపీలో ఉన్నా టీఆర్ఎస్‌లో ఉన్నా ఆమె ఇప్పుడు ఏదో ఒక మంత్రి ప‌ద‌విలో ఉండేవారు. మ‌రి ఇప్పుడు ఆమెను శ‌శిక‌ళ మాత్రం ప‌ట్టించుకుంటుంద‌ని ఆశించ‌డం అత్యాశే క‌దా..!