వైకాపాలో మాజీ సీఎం మ‌న‌వ‌డు

ఏపీ పొలిటిక‌ల్ పార్టీల్లోకి నేత‌ల చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌ర ఏళ్ల స‌మ‌యం ఉన్నా కూడా.. నేత‌లు ఇప్ప‌టి నుంచే త‌మ స్టేజ్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కాక‌లు తీరిన కాంగ్రెస్ యోధుడు, మాజీ సీఎం దివంగ‌త కాసు బ్ర‌హ్మానంద రెడ్డి మ‌న‌వ‌డు కాసు మ‌హేష్ రెడ్డి విప‌క్ష వైకాపా లోకి జంప్ చేశారు. ఈయ‌న తండ్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కూడా అయిన‌ కాసు వెంక‌ట కృష్ణారెడ్డి ఇప్ప‌టికీ కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతుండ‌గా.. మ‌హేష్ రెడ్డి వైకాపా పంచ‌న చేర‌డం హాట్ టాపిక్‌గా మారింది. అధికారికంగా ఈ నెల 16న గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట‌లో భారీ ఎత్తున స‌భ నిర్వ‌హించి వైకాపాలో చేర‌నున్న‌ట్టు మ‌హేష్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో వైకాపా అధినేత జ‌గ‌న్‌తో భేటీ ఆదివారం హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో భేటీ అయిన మ‌హేష్ రెడ్డి.. త‌న‌కు ఎలాంటి స్వార్థం లేద‌ని, న‌మ్మిన సిద్ధాంతం కోసమే, జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేసేందుకే వైకాపా తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు పొలిటిక‌ల్ స్టేట్ మెంట్ ఒక‌టి విసిరేశాడు. వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు వైకాపా జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి త‌దిత‌రుల‌తో వ‌చ్చిన మ‌హేష్ రెడ్డి జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. త‌న విజ‌న్ ఏమిటో జ‌గ‌న్‌కు వివ‌రించిన‌ట్టు మ‌హేష్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అయితే, ఊర‌క‌రారు మ‌హానుభావులు అన్న‌ట్టు.. ఎవ‌రైనా ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో చేరితే ఊరికేనే చేరుతున్న‌ట్టు చెబితే.. న‌మ్మే రోజులు కావుక‌దా? ఇవి! అలాగే.. ఇప్పుడు కూడా మ‌హేష్ రెడ్డి వైకాపాలో చేరిక వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా గుర‌జాల నుంచి 2019లో తాను పోటీ చేస్తాన‌ని మ‌హేష్ చెప్పిన‌ట్టు స‌మాచారం. దీనికి వైకాపా అధినేత ఓకే చేసిన‌ట్టు తెలిసింది. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది. గుర‌జాల ఎమ్మెల్యేగా టీడీపీ నేత య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఉన్నారు.

ఈయ‌న‌కు గ‌ట్టి పోటీ అనుకున్న వైకాపా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా కృష్ణ‌మూర్తి గ‌తంలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం జ‌గ‌న్ కూడా ఎదురు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ రెడ్డి రావ‌డం జ‌గ‌న్‌కి బూస్ట్ ఇచ్చినట్టు అయింద‌ని టాక్. ఇదిలావుంటే మ‌హేష్ పార్టీలో చేరుతున్నందుకు హ్యాపీగా ఉంద‌ని చెబుతున్న జంగాకి 2019లో చెక్ పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి అప్ప‌టి ప‌రిస్థితులు ఎలా మార‌తాయో చూడాలి. ఇప్ప‌టికైతే.. మ‌హేష్ రాక వైకాపాకి కొంత ఊపు తెస్తుంద‌న‌డంలో సందేహం లేదు.