బీజేపీకి యాంటీగా ఒక్క‌ట‌వుతోన్న బాబు – ప‌వ‌న్‌

ఔనా? నిజ‌మా? అనుకుంటున్నారా?! ఇది నిజ‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం ఏర్ప‌డిన ప‌రిణామాల నేప‌థ్యంలో అటు ఏపీ సీఎం, టీడీపీ అధ‌నేత చంద్ర‌బాబు, ఇటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌లు కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇద్ద‌రూ కూడా బీజేపీకి యాంటీగా ఒక్క‌ట‌వుతున్నార‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. నిజానికి పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న న‌వంబ‌రు 8న స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే చేశారు. దీంతో వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. దీనిని స్వాగ‌తించారు. అంతేకాదు, తానే ఈ సూచ‌న చేశాన‌ని చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌గ‌న్ లాంటి వాళ్ల‌కి శాస్తి జ‌రుగుతుంద‌ని కూడా శాప‌నార్థాలు పెట్టారు.

ఇక‌, ఇదే విష‌యంపై స్పందించిన ప‌వ‌న్ కూడా పెద్ద నోట్ల ర‌ద్దును స్వాగ‌తిస్తూనే.. దీనిని అమ‌లు చేయ‌డం అంత వీజీ కాద‌ని అన్నారు. ఈ మేర‌కు నవంబర్ 11వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి కాలేజీలో విద్యార్థులతో పవన్ ముఖాముఖిలో త‌న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇంత వ‌రకు బాగేనే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రి వాయిస్ మారిపోయింది. పెద్ద నోట్ల ర‌ద్దును ఆగ‌స్టు సంక్షోభం క‌న్నా ఎక్కువ‌గా చంద్ర‌బాబు పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో బ్యాంక‌ర్ల‌తో భేటీ అయి.. పెద్ద నోట్ల స్థానంలో చాలిన‌న్ని చిన్న నోట్లు ఇవ్వాల‌ని అన్నారు.

ఇక‌, ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా త‌న వాయిస్ మార్చేశారు. దీనిని చారిత్ర‌క త‌ప్పిదంగా ఇటీవ‌ల ఆయ‌న అభివ‌ర్ణించారు. అంతేకాదు, ఇదే కొన‌సాగితే.. సంక్షోభం త‌ప్ప‌ద‌ని అనేశారు. ఇలా ఇప్పుడు అటు చంద్ర‌బాబు, ఇటు ప‌వ‌న్‌లు బీజేపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతుండ‌డం, కామెంట్ల‌తో కుమ్మేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇక‌, బీజేపీ నేత‌ల‌కైతే పిచ్చిప‌ట్టిస్తోంద‌ట‌! అదేంటి దేశంలో అంద‌రిక‌న్నా ముందుగా స్పందించిన ఇద్ద‌రు నేత‌లు ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డంపై వారు మ‌రింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.