జ‌గ‌న్ మ‌ళ్లీ సేమ్ మిస్టేక్ రిపీట్‌

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్‌.. వైఖ‌రిలో ఎక్క‌డా మార్పు క‌నిపించ‌డం లేదు. సాధార‌ణంగా ఎవరికైనా ఒక‌టి రెండు దెబ్బ‌లు త‌గిలితే వెంట‌నే వారిని వారు స‌రిచేసుకుంటారు. త‌మ పంథా మార్చుకుంటారు. కానీ, వైకాపా అధ్య‌క్షుడి విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ రావ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ.. ఆయ‌న అధికార పీఠ‌మే ల‌క్ష్యంగా చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే విసుగు పుట్టిస్తున్నాయి. ఏడాది కింద‌ట రాజ్ భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయిన సంద‌ర్భంగా జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌లు ఆత‌ర్వాత కాలంలో ఆయ‌న పార్టీని పుట్టి ముంచే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చాయి.

దాదాపు 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో ట‌చ్‌లో ఉన్నారు. ఎప్పుడైనా వాళ్లు మా పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధం. అని ఆనాడు జ‌గ‌న్ రాజ్‌భ‌వ‌న్ ఎదురుగుండా చేసిన వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నం సృష్టించాయి. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న పాలిసీకి విరుద్ధ‌మే అయిన‌ప్ప‌టికీ.. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. దీంతో దాదాపు 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు క్యూక‌ట్టుకుని మ‌రీ టీడీపీలోకి జంప్ చేశారు. అంతేకాదు, జ‌గ‌న్.. త‌న‌కు రైట్ హ్యాండ్‌గా భావించిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి వారు సైతం జంపింగ్ బాట ప‌ట్టారు.

ఇంత జ‌రిగిన త‌ర్వాత.. జ‌గ‌న్ మార‌తాడ‌ని, నిల‌దొక్కుని బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని అంద‌రూ భావించారు. అయితే, జ‌గ‌న్‌లో మాత్రం అటువంటి సూచ‌న నామ‌మాత్రంగా కూడా క‌నిపించ‌డం లేదు. తాజాగా ఇటీవ‌ల నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలోనూ అధికారమే ల‌క్ష్యంగా కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఏడాదే 2017లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, వైకాపా నేత‌లంద‌రూ రెడీ గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు, ప్ర‌ధాని మోదీ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉన్నార‌ని, ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోనూ ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

వాస్త‌వానికి ఏపీలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు 2019 వ‌ర‌కు స‌మ‌యం ఉంది. మరి ఈలోపే దాదాపు రెండేళ్ల‌కు ముందే ఎందుకు నిర్వ‌హించాల్సి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఎన్నిక‌లు వ‌చ్చినా.. దానిని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు సైతం సిద్ధంగానే ఉంటారు. కాబ‌ట్టి ఎన్నిక‌లు వ‌చ్చినంత మాత్రాన జ‌గ‌న్ గెలిచిపోతాడ‌ని అనుకోవ‌డం మ‌ళ్లీ ఆయ‌న 2014 నాటి భ్ర‌మ‌ల్లో ఉన్న‌ట్టేన‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ మారాల‌ని వారు కోరుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎప్ప‌టికి మార‌తాడో చూడాలి!!