అన్నాడీఎంకేను క‌బ్జా చేసే ప‌నిలో బీజేపీ

ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు హ‌వా కొన‌సాగుతూ వ‌స్తోంది. 39 లోక్‌స‌భ స్థానాలతో దేశంలోనే ఎక్కువ ఎంపీ స్థానాలు క‌లిగిన రాష్ట్రంగా ఉన్న త‌మిళ‌నాడు జాతీయ రాజ‌కీయాల‌ను ఎప్పుడూ శాసిస్తూ వ‌స్తోంది. రాజీవ్‌గాంధీ చ‌నిపోయిన‌ప్పుడు ఇదే జ‌య‌లలిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అక్క‌డ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసింది. త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-డీఎంకేలు పొత్తు పెట్టుకుని గ‌ణ‌నీయ‌మైన సీట్లు సాధించాయి. ఇదే జ‌య‌ల‌లిత మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుని వాజ్‌పేయ్ ప్ర‌భుత్వం ప‌డిపోయేందుకు కార‌ణ‌మ‌య్యారు.

ఇలా చెప్పుకుంటూ పోతే 39 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాథినిత్యం వ‌హిస్తు ఉండ‌డంతో పాటు ఇక్క‌డ జాతీయ పార్టీల‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో చాలాసార్లు త‌మిళ‌నాడు హ‌వా జాతీయ రాజ‌కీయాల్లో క‌నిపిస్తూ ఉండేది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో సైతం జ‌య‌ల‌లిత సార‌ధ్యంలోని అన్నాడీఎంకే ఏకంగా 39 స్థానాల‌కు 37 చోట్ల తిరుగులేని విజ‌యం సాధించింది.

అయితే బీజేపీకి నార్త్‌లో తిరుగులేని ఆధిక్యం రావ‌డంతో జ‌య‌ల‌లిత మ‌ద్ద‌తు ఎవ్వ‌రికి అవ‌స‌రం లేకుండా పోయింది. అయితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో డీఎంకే సంక్షోభంలో ఉంది. క‌రుణానిధి వ‌యోభారంతో స్టాలిన్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఫ్యామిలీలో వార‌స‌త్వ పోరు న‌డుస్తోంది. ఇక జ‌య‌ల‌లిత త‌ర్వాత అన్నాడీఎంకేను ఆ స్థాయిలో న‌డిపించే స‌మ‌ర్థులైన నాయ‌కులు లేరు. ఈ రెండు పార్టీల‌కు ఇప్పుడు స‌మ‌ర్థులైన నాయ‌క‌త్వ కొర‌త తీవ్రంగా వేధిస్తోంది.

ఇక జ‌య‌ల‌లిత త‌ర్వాత తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆయన అంత బలమైన, జనాకర్షక నేత కాకపోవడం వల్ల  ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను దాదాపు మూడు ద‌శాబ్దాలుగా శాసిస్తూ వ‌స్తున్నారు. ఆమె జైలుకు వెళ్లిన‌ప్పుడు అనివార్య పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం తనకు విధేయుడు, తాను ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేస్తాడనే ఆయన్ను సీఎంను చేశారు తప్ప పార్టీలో నంబర్ 2 మాత్రం కాదు. తనకు అత్యంత సన్నిహితురాలు శశికళకు సైతం ఈ స్థానం దక్కకుండా తన కనుసన్నల్లో పార్టీని నడుపుతూ వచ్చారు.

ఈ క్ర‌మంలోనే సౌత్‌లో బ‌ల‌ప‌డేందుకు స‌రైన టైం కోసం వేచి చూస్తోన్న బీజేపీ జ‌య‌ల‌లిత ఉండ‌గా ఆమెను క‌దిపే సాహ‌సం కూడా పెద్ద‌గా చేయ‌లేదు. అయితే జ‌య ఆరోగ్యం క్షీణించిన‌ప్ప‌టి నుంచి మాత్రం బీజేపీ పెద్ద‌లు ఆమె ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతూ వ‌స్తున్నారు. ఆమె అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ప్రధాని మోడీ మొదలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎక్కువ ఆరా తీశారు.

ఇక త‌మిళ‌నాడు ఇన్‌చార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న విద్యాసాగ‌ర్ రావు చెన్నైలోనే మ‌కాం వేశారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి నడ్డా అపోలో వైద్యులతో మాట్లాడి, ఎయిమ్స్ నుంచి ప్ర‌త్యేక వైద్య బృందాలు పంపారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ స్కెచ్ చూస్తుంటే అన్నాడీఎంకేకు ద‌గ్గ‌రై ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం లేదా… ఇక్క‌డ అవ‌స‌ర‌మైతే సొంతంగా ఎదిగేందుకు బీజేపీ స్కెచ్ వేస్తున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఈ స్కెచ్‌లో భాగంగానే సీఎం జయలలిత పోర్ట్ పోలియోలను పర్యవేక్షిస్తున్న మాజీ సీఎం, ప్రస్తుత ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంతో బీజేపీ పెద్దలు తరచూ టచ్‌లో ఉంటున్నారు. ఇదే అద‌నుగా బీజేపీ అన్నాడీఎంకేను త‌న వైపున‌కు తిప్పుకుని త‌మిళ‌నాడులో కూడా ఆధిప‌త్యం కోసం ట్రై చేస్తున్న‌ట్టు కూడా దేశ‌రాజ‌కీయాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.