సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ మ్యాట‌ర్‌

జీవిత క‌థ‌ల‌ను పుస్త‌కాలుగా రాసుకోవ‌డం కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ప‌రిమితం అయింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. జీవిత క‌థ‌ల‌ను మూవీలుగా మ‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అశేష ప్రేక్ష‌కుల‌తో మ‌హాన‌టి అనిపించుకున్న సావిత్రి జీవితం తెరంగేట్రం చేస్తోంది! ప్ర‌స్తుతం షూటింగ్ కూడా జ‌రుపుకొంటోంది. ఇక‌, ఈ క్ర‌మంలోనే అన్న‌గారి జీవితాన్ని కూడా తెర‌మీద రికార్డు చేయాల‌ని భావిస్తున్నార‌ట నంద‌మూరి వార‌సులు! నిజానికి చెప్పాలంటే ఏపీ చ‌రిత్ర‌ను అన్న‌గారికి ముందు, అన్న‌గారి త‌ర్వాత అన్న విధంగా చెప్పుకొన్నా.. ఎలాంటి త‌ప్పూ ఉండ‌దు. తెలుగు నేల‌ను అంత‌గా ప్ర‌భావితం చేసిన రాజ‌కీయ దురంధ‌రుడు ఎన్టీఆర్‌. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌నూ పాలిస్తున్న‌ది అన్న‌గారి రాజ‌కీయ అనుచ‌రులే క‌దా!

ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వ‌చ్చి, విజ‌య‌వాడ ఎస్ ఆర్ ఆర్ క‌ళాశాల‌లో బీఏ చ‌దివిన ఎన్‌టీఆర్ ఆ త‌ర్వాత అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చుకుని మ‌ద్రాస్ వెళ్లీ.. మూవీ రంగంలో స్ధిర‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం చూసి తీవ్రంగా ప్ర‌భావిత‌మై.. తెలుగువారికి ఢిల్లీలో(ఇంద‌ర హ‌యాం) ఎలాంటి గౌర‌వ‌మూ లేద‌ని ఆవేద‌న చెంది.. తెలుగు వారి స‌త్తా ఏంటో వాళ్ల‌కి రుచి చూపించాల‌ని నిర్ణ‌యించుకుని తెలుగు దేశం పేరుతో తెలుగునాట సంచ‌ల‌నం సృష్టించారు. పార్టీ పెట్టిన నాలుగు మాసాల్లోనే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కి, అమ్మ‌గా పేరు ప‌డ్డ ఇందిర‌కు భారీ షాక్ ఇచ్చారు. సీఎం అయ్యారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిక‌రం. సీఎంగా ఉంటూనే ఆయ‌న ఎన్నో మూవీల్లో న‌టించారు. అంతేకాదు, తెలుగు వాడు ప్ర‌ధాని అవుతుంటే మేం మ‌ద్ద‌తిస్తాం అంటూ.. పీవీ న‌ర‌సింహారావు పై పోటీ చేయ‌కుండా త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత‌టి గొప్ప‌మ‌న‌సున్న నేత జీవితం త్వ‌ర‌లోనే వెండితెర‌మీద‌కి తీసుకురావాల‌ని, మ‌రెంద‌రికో అన్న‌గారి జీవిత సారాన్ని అందించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట అన్న‌గారి మ‌న‌వ‌డు క‌ళ్యాణ్ రామ్‌.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకోనుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది టాలీవుడ్‌లో. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారుడు బాల‌య్య‌, మ‌న‌మ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ న‌టిస్తార‌ని వార్త‌లు వస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే తెలుగు ప్ర‌జ‌ల‌కు ఇంత‌క‌న్నా కావాల్సింది ఏముంటుంది? వెండి తెర‌పై అన్న‌గారి జీవితాన్ని చూసుకోవ‌డాన్ని మించిన అనుభూతి ఇంకేముంటుంది?!